జైపూర్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిజెపి ఎంపి రమేష్ బిధురీ.. బిఎస్పీ ఎంపి డానిష్ అలీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రమేష్ బిదురీ చేసిన మతపరమైన వ్యాఖ్యలను పలువురు బిజెపి నేతలే ఖండించారు. ఈ నేపథ్యంలో రమేష్ బిధురీకి బిజెపి అధిస్టానం ప్రమోషన్ ఇచ్చింది. జైపూర్‌లోని టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.
కాగా, పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఎంపి డానిష్ అలీ మాట్లాడుతూ.. ఎంపీలను మతపరంగా దూషించడానికే ఈ ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించారని, రమేష్ బిధురీ చేసిన వ్యాఖ్యలకు బిజెపి శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూడాలి అని వ్యాఖ్యానించారు. ఎంపి డానిష్ ఆరోజే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కావడంతో.. రాజ్యసభ ఎంపి కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. బిజెపి ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు, ప్రమోషన్‌లు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రమేష్ బిధూరికి టోంకో జిల్లా ప్రచార నిర్వహణ బాధ్యతల్ని అప్పగించింది అని అన్నారు.










