- పిఎసిఎస్ ఉద్యోగుల దీక్షల్లో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి-గుంటూరు:పోరాటలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఢిల్లీ రైతు పోరాటం స్ఫూర్తితో పిఎసిఎస్ ఉద్యోగులు పోరాడాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరులోని సహకార శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద పిఎసిఎస్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కెఎస్.లక్ష్మణరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో సహకార ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సహకార రంగం ఉంటేనే ఉద్యోగులకు భద్రత ఉంటుందని తెలిపారు. సహకార రంగం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు పోరాడాలని కోరారు. 2014 నుండి పిఎసిఎస్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. సహకార రంగంలో ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాల కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు సహకార సంఘాలే వేతనాలు ఇస్తున్నాయని, ప్రభుత్వం వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల వారికి అన్యాయం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులకు కాస్తోకూస్తో సహకార సంఘాలే రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. సహకార రంగం బాధ్యత రాష్ట్రపతిదని, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాల్లో మార్పులు చేస్తోందని విమర్శించారు. ప్రయివేటీకరణపై రైతులను చైతన్యం చేయాలని కోరారు. దీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.అజరుకుమార్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.










