Aug 02,2023 09:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2023-24లో వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీ కరణ సాధ్యం కాదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరద్‌ తెలిపారు. రాజ్యసభలో వైసిపి ఎంపి పరిమల్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా లావాదేవీకి సలహాదారుల నియామక ప్రక్రియ పూర్తయిందని, అయితే ఆసక్తిగల అర్హతగల పార్టీల నుండి ఆసక్తి వ్యక్తీకరణ (ఇఒఐ) ఇంకా జారీ కాలేదని అన్నారు. ఇఒఐ దశ పూర్తయిన తరువాత రెండో దశలో మాత్రమే లావాదేవీల నిబంధనలు, షరతులు ఖరారు చేయబడతా యని అన్నారు. ప్రస్తుతం, ఇఒఐ దశ ఇంకా ప్రారంభించలేదని తెలిపారు.
 

                                                               రూ.950 కోట్ల ఉపాధి హామీ బకాయిలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీలో రూ.950 కోట్లు వేతన బకాయిలు ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. 2023 జులై 26 నాటికి ఎపిలో ఉపాధి హామీలో వేతనాల బకాయిలు రూ.950 కోట్లు, యంత్రాల బకాయిలు రూ.40 కోట్లు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.6,366 కోట్లు వేతన బకాయిలు, రూ.6,266 కోట్లు యంత్రాల బకాయిలు ఉన్నాయన్నారు.
 

                                                    తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిల వసూలుకు చర్యలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.6 వేలకోట్లకు పైగా విద్యుత్‌ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ ప్రకటించారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు కొంతకాలం సక్రమంగానే ఛార్జీలను చెల్లించిన తెలంగాణ తదనంతరం చెల్లింపులను నిలిపేసిందని తెలి పారు. ఫలితంగా విద్యుత్‌ ఛార్జీల బకాయిలు రూ.6 వేలకోట్లకు పైగా పేరుకుపోయాయని అన్నారు. ఒక రాష్ట్రం బకాయిలు చెల్లించకుండా మొండికేసిన సందర్భంలో బకాయిల చెల్లింపు కోసం కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రిత్వ శాఖతోను, ఆర్థిక మంత్రిత్వ శాఖతోను చర్చలు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్ర పన్నులలో వాటా కింద తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి ఈ బకాయిల మొత్తాన్ని మినహాయించ వలసిందిగా రిజర్వు బ్యాంక్‌ను కోరే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
 

                                                      ఎపి ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.79,815 కోట్ల రుణాలు తీసుకునేందుకు గ్యారెంటీ ఇచ్చిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎపి ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ద్వారా 2021-22 ఏడాదిలో రూ.22,366.08 కోట్లు, 2022-23 ఏడాదిలో రూ.57,449.55 కోట్లు తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉందని తెలిపారు.
 

                                                        ఆదాయపు పన్నుశాఖలో 27,564 పోస్టులు ఖాళీ

ఆదాయపు పన్ను శాఖలో 27,564 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభ లో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 జూన్‌ 1 నాటికి 1,164 గ్రూప్‌ ఎ, 464 గ్రూప్‌ బి (గెజిటెడ్‌), 25,936 గ్రూప్‌ బి (నాన్‌ గెజిటెడ్‌), గ్రూప్‌ సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.