Oct 11,2023 10:36
  • రెండో స్వేస్‌పోర్ట్‌కు భూసేకరణ పూర్తి
  • రెండు వేల ఎకరాలు కేటాయింపు

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో స్పేస్‌పోర్ట్‌ (అంతరిక్ష పరిశోధన కేంద్రం)ను తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు. తూత్తుకుడి జిల్లాలోని కులశేఖరపట్టణంలో నిర్మించే ఈ స్పేస్‌పోర్ట్‌ సుమారు రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. ప్రయివేటు రంగ శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లేందుకు మాత్రమే ఈ కేంద్రాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ దావన్‌ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) నుంచి ఇస్రో స్వీయ వ్యోమ నౌకలను పంపడంతో పాటు ప్రయివేటు వ్యోమనౌకలను, కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్నారు. ఇక నుంచి ప్రయివేటు రంగానికి సంబంధించిన వ్యోమనౌకలను, ఉపగ్రహాలను కులశేఖరపట్టణంలో నిర్మించే స్పేస్‌పోర్టు నుంచి పంపించనున్నారు. ఇందుకోసం అవసరమైన రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇస్రోకు అప్పగించినట్లు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. అయితే ఇక్కడ నిర్మించే స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ను ప్రైవేట్‌ రంగం మాత్రమే వినియోగిస్తుంది. ఈ వివరాలను బెంగళూరులో మంగళవారం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌-స్పేస్‌) చైర్మన్‌ డాక్టర్‌ పవన్‌ గోయెంకా వెల్లడించారు. 'మేం తూత్తుకుడి జిల్లాలో పూర్తి ప్రయోగ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇది ఎస్‌ఎస్‌ఎల్‌వి ప్రయోగాల కోసం అంకితం చేయనున్నాం. సుమారు 2 వేల ఎకరాలను సేకరించి ఇస్రోకు అప్పగించారు. బడ్జెట్‌, ప్లానింగ్‌ వివరాలు చర్చిస్తున్నాం. ఇప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి రానుంది' అని తెలిపారు. అలాగే, ఈ లాంచ్‌ ప్యాడ్‌ను ప్రైవేట్‌ రంగం మాత్రమే ఉపయోగిస్తుందని గోయెంకా తెలిపారు. ఇక్కడ నుంచి ఇస్రో రాకెట్లు ప్రయోగించబోరని తెలిపారు. ఈ స్పేస్‌పోర్ట్‌కు సమీపంలో ఒక స్మాల్‌ స్పేస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌ కూడా రానుందని తెలిపారు. ప్రస్తుతానికి ఇస్రోకు శ్రీహరికోటలో ఒక స్పేస్‌పోర్ట్‌ ఉన్న సంగతి తెలిసిందే.