Aug 09,2023 21:54

లండన్‌: టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా వరుస వైఫల్యాలకు పుల్‌స్టాప్‌ పెట్టాడు. ఇంగ్లండ్‌లోని దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న పృథ్వీ షా.. డొమెస్టిక్‌ వన్డే కప్‌-2023 టోర్నీలో డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు 81 బంతుల్లో సెంచరీ అందుకున్న పృథ్వీ షా.. మరో 48 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఔటైన పృథ్వీ షా మొత్తం 28 ఫోర్లతో పాటు 11 సిక్స్‌లు బాదాడు. దాంతో నార్తాంప్టన్‌ షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు చేసి.. ఇంగ్లండ్‌ వన్డే కప్‌ టోర్నీలోనే అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పృథ్వీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డే కప్‌లో ఓలీ రాబిన్సన్‌ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 206 పరుగులను పృథ్వీ షా అధిగమించాడు. లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్‌ నమోదు చేశాడు. పురుషుల లిస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన మూడో ప్లేయర్‌గా, ఇంగ్లండ్‌ లిస్ట్‌ ఏ క్రికెట్‌లో రెండో వ్యక్తిగత స్కోర్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2002 గ్లోకోస్టర్‌ ట్రోఫీలో అలీ బ్రాన్స్‌ 268 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక డబుల్‌ సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ ముందున్నాడు. వన్డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పృ థ్వీ షా.. చతేశ్వర్‌ పుజారాను అధిగమించాడు.