Sep 10,2023 10:35
  • పలువురు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు గైర్హాజరు
  • అనారోగ్య కారణాలతో మన్మోహన్‌, దేవేగౌడ దూరం

న్యూఢిల్లీ : జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి తరలివచ్చిన వివిధ దేశాధినేతలు, ఇతర అతిథులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సాయంత్రం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక అయిన ప్రగతిమైదాన్‌లోని 'భారత్‌ మండపం'లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్రపతి ముర్ము అతిథులకు స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదిక బ్యాగ్రౌండ్‌లో 'నలంద విశ్వవిద్యాలయం' చిత్రాన్ని ఉంచారు. ఈ విందులో విదేశీ అతిథులతో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

11

                                                                      బంగారం, వెండి పాత్రల్లో వడ్డన

విందులో భాగంగా అతిథులకు బంగారం, వెండి పాత్రల్లో విందు వడ్డించడం విశేషం. చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె (బ్రెడ్‌ వంటి ఫ్రెంచి వంటకం), గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రఉమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతో పాటు ముంబయి పావ్‌ కూడా ఏర్పాటు చేశారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ విందు మెనులో చోటు దక్కించుకున్నాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.
 

                                                                   పలువురు నేతల గైర్హాజరు

ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలనూ ఈ విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ విందుకు మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడలు హాజరవ్వలేదు. ఆనారోగ్య కారణాల రీత్యా తాము రాలేమని వారు తెలియచేశారు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు కూడా గైర్హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఢిల్లీ సిఎం కేజ్రివాల్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, హిమాచాల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు హాజరైనట్లు తెలిసింది. కాగా ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక సిఎంలు హాజరు కాలేదు. రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ విందుకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించలేదు. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలకు హాజరుకావాల్సివున్నందున కేరళ సిఎం పినరయి విజయన్‌, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా ఈ విందుకు హాజరు కాలేదు.
 

                                                                           తొలిరోజు హైలైట్స్‌!

జి20 సదస్సు తొలి రోజులో భాగంగా సభ్యదేశాలు పలు కీలక అంశాలపై చర్చించాయి. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం, ఢిల్లీ డిక్లరేషన్‌కు ఒక రోజు ముందుగానే శనివారమే ఆమోదం తెలపడం వంటి విశేషాలు తొలి రోజే చోటుచేసుకున్నాయి. కాగా పలు సభ్యదేశాలతో భారత్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపింది.

  • ప్రపంచ జీవ ఇంధన కూటమి : ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రారంభిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపేందుకు ఉద్దేశించిన ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
  • జి20 శాటిలైట్‌ మిషన్‌ ప్రతిపాదన: వాతావరణం, పర్యావరణ పరిశీలన కోసం ప్రత్యేకంగా 'జి20 శాటిలైట్‌ మిషన్‌'ను భారత్‌ ప్రతిపాదించింది. ఇందుకోసం భారత్‌ చేపట్టిన 'గ్రీన్‌ క్రెడిట్‌ ఇనిషియేటివ్‌' కార్యక్రమంపై నేతలు కృషిని ప్రారంభించాలని కోరారు.
  • బ్రిటన్‌ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు: జి20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పెట్టుబడులకు ఊతమివ్వడం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన మోదీ.. సంపన్న, సుస్థిర ప్రపంచం కోసం భారత్‌, బ్రిటన్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయని అన్నారు.
  • జపాన్‌ ప్రధానితో మోదీ భేటీ: జి20 సదస్సు నేపథ్యంలో అటు జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించామని.. అనుసంధానం, వాణిజ్యంతోపాటు ఇతర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇరునేతలు చెప్పారు.