కోరన్న, మంగన్న వర్థంతి సభలో సిపిఎం సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి
ప్రజాశక్తి - కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాస్తున్నాయని, వాటిని కాపాడుకునేందుకు కోరన్న, మంగన్న స్ఫూర్తితో గిరిజనులంతా ఐక్యమై ఉద్యమించాలని సిపిఎం సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ మామిడిమానుగూడలో మంగళవారం కోరన్న, మంగన్న 56వ వర్ధంతి జరిగింది. తొలుత కోరన్న, మంగన్న స్తూపం వద్ద సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండగొర్రి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆనాడు కోరన్న, మంగన్న పోరాటాల ఫలితంగా 1/70 చట్టం, జిసిసి, ఐటిడిఎ, ఆస్పత్రులు, ఆశ్రమ పాఠశాలలు వంటివి వచ్చాయని గుర్తుచేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నూతన అటవీ విధానం పేరుతో గిరిజనులను అడవుల నుంచి తరిమివేయడానికి ప్రయత్నిస్తోందని, దీనిపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాటానికి గిరిజనులంతా ఏకతాటికి వచ్చి కమ్యూనిస్టు పార్టీలకే పట్టం కట్టాలని, అప్పుడే నిజమైన పరిపాలన సాగుతుందని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె అవినాష్ మాట్లాడుతూ జిఒ 3ను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తే రాష్ట్రంలోని వైసిపి, టిడిపి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా కోరన్న, మంగన్న స్ఫూర్తితో పోరాడాలని కోరారు. చెముడుగూడ ఎంపిటిసి సభ్యులు ఎం రమణ మాట్లాడుతూ బోయ/వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చి గిరిజనులకు అన్యాయం చేయడానికి చూస్తున్నారని, వీటన్నింటికీ వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.










