Sep 03,2023 16:36

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఆదోని పట్టణంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒకటవ వార్డు ప్రశాంత్‌ నగర్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు రోడ్లపై నిలిచి చెరువును తలపిస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టులో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించి నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి తడిచి ముద్దయ్యాయన్నారు. మురుగు కాలువకు కల్వర్ట్‌ వేస్తే నీరు నిలిచే అవకాశముండదనే విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఒక్కటో వార్డ్‌ ఇంచార్జి వెంకటేష్‌ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ రోజులు నీరు నిలవడం వల్ల ప్రజలు రోగాలబారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నమోదైన వర్షపాతం ఆదోని డివిజన్‌లో 168.4 మిమీ వర్షంపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఆదోని డివిజన్‌ మొత్తం 168.4, సగటు 18.7 మిమీ వర్షపాతం ఆదివారం నమోదైంది. ఆదోని 94.8, పెద్దకడుబూరు 40.4, కౌతాళం 8.4 మిమీ, మంత్రాలయం 7.6, ఎమ్మిగనూరు 4.8, నందవరం 4.6, గోనెగండ్ల 3.6, కోసిగి 4.2 వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రోడ్లు చిత్తడిగా మారి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరుచేరి జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.