- డిమాండ్ తీర్చలేకపోతున్న డిస్కంలు
- తగ్గిన విండ్ పవర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు తగ్గ అవసరాన్ని డిస్కంలు తీర్చలేకపోతున్నాయి. దీంతో అప్రకటిత కోతలను డిస్కంలు విధిస్తున్నాయి. లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కోతలు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. లోడ్ రిలీఫ్ పేరుతో విధిస్తున్న అప్రకటిత కోతలతో ప్రజలు గురువారం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం 240.4 మిలియన్ యూనిట్లు(ఎంయు)ల విద్యుత్ డిమాండ్ ఉండగా ఇందులో 4.49 ఎంయుల మేర డిస్కంలు కోతలు విధించాయి. ఇపిడిసిఎల్ పరిధిలో గురువారం 1.938ఎంయులు, ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 2.190 ఎంయులు చొప్పున కోతలు ఉన్నాయి. శుక్రవారం డిమాండ్ 231.6 మిలియన్ యూనిట్లు కాగా, ఇందులో 5.51 ఎంయుల కొరత ఉంది.ఇపిడిసిఎల్ పరిధిలో 2.850ఎంయులు, ఎస్‌పిడిసిఎల్, సిపిడిసిఎల్ పరిధిలో 2.656 చొప్పున కోతలు ఉన్నాయి. ఆగస్టు నెలలో మొత్తం 6 రోజులు 5 మిలియన్ యూనిట్లు(ఎంయులు)పైగా కోతలు విధించాయి. 10 రోజుల పాటు ఒక మిలియన యూనిట్ల చొప్పున కోతలు విధించాయి. సుమారు 70 మిలియన్ యూనిట్ల వరకు డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం పీక్ అవర్‌లో యూనిట్ ధర రూ.10ల చొప్పున ఉంది. అసాధారంగా నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోతున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో పవన విద్యుత్ ఉత్పత్తి సుమారు 40 ఎంయుల వరకు ఉంటుందని ప్రస్తుతం ఇది 10 ఎంయుల లోపే ఉంటుందని అంటున్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వీలైనంత మేర పగటి సమయంలోనే కోతలు విధిస్తున్నామని చెబుతున్నారు. మరో రెండు రోజుల వరకు కోతలు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆగస్టులో అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేనంతగా ఉన్నాయని, అందువల్లే కొంత కోతలు విధించాల్సి వస్తుందని చెబుతున్నారు.
ప్లాంట్లలో అడుగంటిన బొగ్గు నిల్వలు
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటాయి. నిబంధనల ప్రకారం 15 రోజులకు సరిపడ బొగ్గు అంటే ఉండాలి. బొగ్గు కొరత ఉండటంతో ప్లాంట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో మూడు థర్మల్ ప్లాంట్లు నడుస్తున్నాయి. నెల్లూరులోని కృష్ణపట్నం ప్లాంట్ రోజుకు 19000 మెట్రిక్ టన్ను(ఎంటి)ల బొగ్గు అవసరం. అయితే ఇక్కడ 6,33,47 ఎంటిలు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం మూడు రోజులకు మాత్రమే వస్తుంది. రాయలసీమ ప్లాం ట్‌కు రోజు 21వేల ఎంటిలు అవసరం కాగా ప్రస్తుతం అక్కడ 46670 ఎంటిలు అంటే రెండు రోజులకు సరిపడ మాత్రమే ఉంది. విటిపిఎస్ ప్లాంట్‌కు రోజుకు 28500 ఎంటిలు అవసరంగా కాగా ప్రస్తుతం అక్కడ 71,313 ఎంటిలు అంటే రెండున్నర రోజులకు సరిపడ మాత్రమే ఉంది.
దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్: సిఎం జగన్
ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో విద్యుత్ డిమాండ్ దేశవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అయినా ఎక్కడా కూడా రైతులకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చేసేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వర్షాల కొరత నేపథ్యంలో నిర్వహించిన సమీక్షలో శుక్రవారం ఆయన ఈ విషయం ప్రస్తావించారు. యూనిట్ ధర రూ.7.52లు పెట్టి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టులో రూ.966.09 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశామని, ఎండలు అధికంగా ఉండే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా ఇంత ఖర్చు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా 231 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని అధికారులు సిఎంకు తెలిపారు. గతేడాదితో పోలిస్తే గ్రిడ్ డిమాండ్ 18శాతం వరకూ పెరిగిందని వివరించారు. గాలి లేనందున పవన విద్యుత్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. తడి బొగ్గు రావడంతో సామర్ధ్యం మేరకు థర్మల్ కేంద్రాలు విద్యుత్‌ను ఉత్పిత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.










