- న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : న్యాయవాది భగవాన్ తన కుమార్తె లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదు చేస్తే, భవానిపురం పోలీసులు ఫిర్యాదు రిజిస్టర్ చేయకుండా, న్యాయవాది భగవాన్‌పై తిరిగి ఎదురు కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ మచిలీపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నం న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, పుప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. మా తోటి సహ న్యాయవాది విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు భగవాన్ 10 సంవత్సరాల కుమార్తె ఒక పార్కులో ఆడుకుంటుండగా ఒక వ్యక్తి ఆ పాపను లైంగికంగా వేధించుచున్నాడని సంబంధిత పోలీసు స్టేషనుకు వెళ్లి ఆ వ్యక్తిపై రిపోర్ట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయమని అడిగితే చేయకుండా రెండు గంటలసేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం న్యాయవాదులను అవమానించడమేనన్నారు. పైగా స్థానిక రాజకీయ ఒత్తిడికి పోలీసు వారు లోనై భగవాన్ పైనే తిరిగి 354 కింద అబద్ధపు కేసు నమోదు చేసి పోలీసు వారు వేధించడం దుర్మార్గం అన్నారు. దీంతో న్యాయవాది భగవాన్ కుటుంబం గత నాలుగైదు రోజుల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతోందన్నారు. కాబట్టి ఇప్పటి కైన పోలీసులు స్పందించి లైంగిక వేదింపులకు పాల్పడిన వ్యక్తి పై కేసు రిజిస్టర్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయ వాది భగవాన్‌పై అక్రమంగా చేసిన నమోదు కేసు ను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులపై తగిన చర్య తీసుకోవాలని, వెంటనే భవానిపురం సిఐ ఉమర్, ఏఎస్‌ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చీలి ముసలయ్య, న్యాయవాదులు మాదివాడ వెంకట నరసింహారావు , తిరుమాని సత్యనారాయణ, ప్రకాష్, కోటేశ్వరరావు, ఆకునూరి నాగేంద్రరావు, పామర్తి వెంకటేశ్వరరావు, సాయి కుమార్, శ్రీనివాస్, మహిళా న్యాయవాదులు , సర్వలలిత కుమారి, పద్మావతి, రమాదేవి మరియు న్యాయవాదుల గుమస్తాల సంఘం ప్రతినిధి పి.వి. ఫణికుమార్ తదితర సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు.










