- సాధారణ వరదగా భావించవద్దు
- 4 మండలాల్లో గ్రామాల ముంపుపై ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భద్రాచలం వద్ద గోదావరి వరద 35 అడుగులు ఉన్న సమయంలోనే గ్రామాల్లోకి నీళ్లు ప్రవేశించడానికి పోలవరం రిజర్వాయర్ బ్యాక్ వాటరే కారణమనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక, చింతూరు, కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఇటీవల వచ్చిన వరద ప్రాంతాల్లో తనతోపాటు సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ తదితరులు పర్యటించినట్లు లేఖలో తెలిపారు. ముఖ్యమంత్రి కూనవరం వస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, అయితే ఆ పర్యటన వాయిదా పడిందని తెలిసిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి ముందే అక్కడి విషయాలను లేఖ ద్వారా సిఎం దృష్టికి తీసుకురాదలచినట్లు వివిరంచారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 35 అడుగులు ఉన్నప్పుడే గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తున్నందున వీటిని సాధారణ వరద ముంపుగా భావించడం సరైనది కాదని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 41.15 కాంటూరు లోపే అనేక గ్రామాలు మునిగి పోతున్నందున వాటికి మొదటి దశలోనే పునరావాసం కల్పించాలని కోరారు. సాధారణంగా గోదావరికి నాలుగు ఐదు ఏళ్లకు ఒకసారి వరదలొస్తాయని, కానీ ప్రస్తుతం వరుసగా వరదలొస్తున్నాయని తెలిపారు. గత సంవత్సరం వరదలు మరవక ముందే మరలా ఈ సంవత్సరం వచ్చాయని పేర్కొన్నారు. గత సంవత్సరమంత తీవ్రత లేనప్పటికీ ప్రజలను ప్రస్తుత వరదలు కూడా భయ భ్రాంతులకు గురి చేశాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి రావడమే ఈ పరిస్థితికి కారణమని వివరించారు. ఇలా చెప్పడానికి కావలసినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు.. ఎటపాక మండలం వీరాయిగూడెం గ్రామాన్ని సందర్శించిన సమయంలో గోదావరి వరదల్లో భద్రాచలం వద్ద 42 అడుగుల వరకు వచ్చిన తర్వాత మాత్రమే తమ గ్రామానికి వరద వస్తుందని స్థానికులు చెప్పారని, అయితే, గత సంవత్సరం జూలైలో వచ్చిన వరదలకు గ్రామం పూర్తిగా మునిగిపోయిందని తెలిపారు. ఇప్పుడు వచ్చిన వరదల్లో కూడా చుట్టూ నీళ్లు వచ్చి గ్రామాన్ని దిగ్బంధనంలో ముంచిందని సిఎం దృష్టికి తీసుకువచ్చారు. భద్రాచలం వద్ద 35 అడుగులకు చేరుకోవడానికి ముందే ఈ గ్రామంలోకి నీళ్లొచ్చాయని పేర్కొన్నారు. కేవలం పోలవరం బ్యాక్ వాటర్ రావడం వల్ల మాత్రమే ఈ పరిస్తితి ఏర్పడిందని తెలిపారు. ఆ గ్రామస్తులకు రెండు వారాలుగా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని పేర్కొన్నారు. బయటకు వచ్చి ఏదైనా వస్తువులు కొనుక్కొని వెళ్లడానికి, తిండి గింజలు తీసుకోవడానికి అవసరమైన పడవలూ ఇవ్వలేదని తెలిపారు. 10 - 12 అడుగులు లోతున నీళ్లు ఊరు చుట్టూ చేరినందున బయటకు రాగలిగే స్థితి లేదని, 12 రోజుల తర్వాత కలెక్టరుకు విన్నవించుకున్నాక బోటు ఒకటి పంపించారని పేర్కొన్నారు. ఆ బోటు వచ్చేటప్పటికి నీళ్లు తగ్గడం మొదలైందని తెలిపారు. 12 రోజుల పాటు వారికి ఎలాంటి సహాయం అందలేదని, ఇప్పటికీ నిత్యావసరాలు ఇవ్వలేదని వివరించారు.
ఎటపాక గ్రామంలో సైతం దళితులు అత్యధికంగా నివసించే లోతట్టు ప్రాంతాలు చుట్టూ నీళ్లు వచ్చినప్పటికీ వారికి నిత్యావసర సరుకులు అందించలేదని తెలిపారు. గత సంవత్సరం కూడా వరదల్లో ఈ ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయని తెలిపారు. అప్పట్లో గ్రామ వాలంటీర్లు ప్రజల సామాన్లు ఎత్తయిన ప్రాంతాలకు తరలించారు తప్ప ఇతర సహాయచర్యలు అందివ్వలేదని తెలిపారు. పైన వర్షం.. కింద వరద ఈ పరిస్థితుల్లో వారెలా బతికారో అర్థం చేసుకోవాలని కోరారు.
కూనవరం గ్రామానికి కూడా ఈసారి వరదలొచ్చాయని, గత సంవత్సరం వచ్చిన వరదల కన్నా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఈ మండలంలో 45 కాంటూరులో ఉండేటువంటి అనేక గ్రామాలు 32వ కాంటూరు లోనే మునిగి పోయాయని తెలిపారు. గ్రామంలోకి నీరు రాకపోయినా, చుట్టూ నీరు చేరినటువంటి గ్రామాలను కూడా మునక గ్రామం కిందే గుర్తించాలని కోరారు. శబరి పొంగి చింతూరు గ్రామాన్ని ముంచి వేసిందని, పది రోజులపాటు శబరికి అటూ ఇటూ ఉన్న కాలనీల్లో ప్రజలు హైస్కూల్లో ఆశ్రయం పొందారని పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం లోనూ, అక్కడ కనీస అవసరాలు తీర్చడం లోనూ ప్రభుత్వ యంత్రాంగం శ్రద్ధ పెట్టలేదని, కూనవరం, వి ఆర్ పురం గ్రామాల్లో గుట్టల మీదకు చేరిన వారికి ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదని పేర్కొన్నారు.
శిబిరాల నుండి తిరిగి వెళ్లే వారికి ప్రభుత్వం ప్రకటించినట్లుగా రెండు వేల రూపాయలు ఇవ్వలేదని అదేసమయంలో సిఎం వస్తున్నారని కూనవరంలో హడావుడి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికీ అనేక మంది రోడ్ల మీదే నివాసం వున్నారని, ముందస్తు సహాయక చర్యల కోసం జూన్ 29వ తేదీనే ఉత్తరం రాశానని, అయినా బాధితులను గాలికి వదిలేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మునిగిన లేదా చుట్టూ నీరు చేరిన గ్రామాల ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి పది వేల రూపాయల సహాయం అందించాలని కోరారు.
వరద బాధిత ప్రాంతంలో ప్రకటించిన ప్రభుత్వ సహాయం సత్వరమే అధికార యంత్రాంగం ద్వారా అమలు చేయించాలని కోరారు. మొత్తం అన్ని మునక మండలాల్లో వర్గీకరణ చేయకుండా వరద సహాయం ప్రతీ గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పినట్లు ఈ రోజు కూడా మీడియాలో వచ్చిందని దాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 'తేడాలు లేకుండా వరద ప్రాంత గ్రామాలన్నింటికీ మీరు ప్రకటించిన నిత్యావసరాలను సత్వరమే అందించండి' అని సిఎంకు విజ్ఞప్తి చేశారు. అన్ని మండలాల్లోను వరద నష్టాన్ని వెంటనే ఎన్యూమరేషన్ చేయించాలని, ఖచ్చితంగా ఆస్తి నష్టం అంచనా వేయాలని, నష్టపరిహారం, తక్షణ వైద్య సహాయం, శిబిరాలు నిర్వహించాలని కోరారు. గ్రామాల్లో ఇప్పటివరకు బ్లీచింగ్ కూడా చేయలేదని, రోడ్ల మరమ్మతులు చేసి రాకపోకలు యధాస్థితికి తీసుకురావాలని కోరారు. వరదలొచ్చినా ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కూనవరం సందర్శించినపుడు నేరుగా ఆ గ్రామానికి వచ్చి పోవడం కాకుండా భూ మార్గాన గ్రామస్తులను కలిసి క్షేత్రస్థాయి రిపోర్టుల ఆధారంగా వాస్తవాలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.










