ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఓఎం వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మొక్కల పెంపకం, వర్షాలు- పంట నష్టం, పేదలందరికీ ఇళ్లు, పీఎం కిసాన్, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో బాగంగా పచ్చదనం పెంపుదలకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలను విరివిగా నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల 28వ తేదీ శుక్రవారం జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఇందుకోసం సమీపంలోని నర్సరీల నుండి కావలసిన మొక్కలను తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటడం ఒకరోజుతో సరిపెట్టకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొనేలా చూడాలన్నారు. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తమ పరిధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అలాగే సంబంధిత ఎంపీడీవోలు అటవీ శాఖ జిల్లా విద్యాధికారి ఐసిడిఎస్ డిఆర్డిఏ డ్వామా ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎన్ని ఎకరాల పంటలు నీట మునిగాయో అంచనా వేసి, నష్టం వివరాలు తెలియజేసే తాత్కాలిక నివేదికను కూడా వెంటనే అందజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 4000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వెంటనే బ్యాంకు రుణాలు అందేలా చేసి గృహాల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్,మెప్మా అధికారులను ఆదేశించారు. ఈ టెలికన్ఫరెన్స్లో డి ఎఫ్ ఓ రాజశేఖర్, డీఈవో తెహర సుల్తానా, జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, డ్రైనేజి శాఖ ఈఈ విజయలక్ష్మి, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డిఆర్‌డిఏపి డిపిఎస్‌ఆర్ ప్రసాద్, ఐసిడిఎస్‌పిడి సువర్ణ, ఆర్డీవోలు కమిషనర్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దారులు తదితర అధికారులు పాల్గొన్నారు.










