Oct 10,2023 15:46

న్యూఢిల్లీ : పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య గత కొన్నిరోజులుగా యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా మిలెంట్ల గ్రూప్‌ హమాస్‌ రాకెట్ల దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనా మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు తమ మద్దతుని ప్రకటించాయి. ఈ కోవలోకి తాజాగా భారత్‌ కూడా చేరింది. యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్‌కి భారత్‌ అండగా నిలుస్తుందని భారత ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకి మోడీ ఫోన్‌ చేసి తమ మద్దతును తెలిపారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 'ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై వివరించినందుకు నెతన్యాహుకు ప్రత్యేక ధన్యవాదాలు. కష్టకాలంలో ఉన్న ఇజ్రాయెల్‌కి భారత ప్రజలు అండగా నిలుస్తారు. ఉగ్రవాదాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తుంది.' అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.