పంజాబ్ : పంజాబ్‌లో అన్నదాతల ఉద్యమం మూడవ రోజు కొనసాగుతోంది. ఇటీవల సంభవించిన వరదల నష్టాల నుండి బయటపడవేసే ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించాలని, రుణాలను రద్దు చేయాలని ... ఈ మూడు డిమాండ్లపై పంజాబ్‌లో 3 రోజులుగా నిరసన కార్యక్రమాలను రైతులు నిర్వహించారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం శనివారం కూడా కొనసాగుతోంది.
విపత్తుగా మారిన తీవ్ర వరదలు...
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పంటకు మద్దతు ధర నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఉత్తర భారతదేశం అంతటా తీవ్ర వరదలు వచ్చాయి. వరద బాధిత రైతుల కోసం కేంద్రం రూ.50 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి ఉంది. రైతులు, వ్యవసాయ కూలీలకు రుణమాఫీ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గని ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
17 చోట్ల రైల్వే, రహదారుల దిగ్భంధనాలు...
వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రైతులు నష్టపరిహారం, మద్దతు ధర లేదా ఎంఎస్‌పి వ్యవసాయ రుణాల మాఫీకి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ... పంజాబ్ అంతటా రైల్వేలు, రహదారులను దిగ్బంధించారు. శుక్రవారం చండీగఢ్-అంబలా-ఢిల్లీ జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. అమఅత్‌సర్-ఢిల్లీ మార్గంలో దేవిదాస్‌పురా స్టేషన్, హౌషియార్‌పూర్ స్టేషన్‌తో సహా పలు చోట్ల రైళ్లను దిగ్బంధించారు. పంజాబ్‌లోని మోగా, హౌషియార్‌పూర్, గురుదాస్‌పూర్, జలంధర్, తరణ్ తరణ్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్‌పూర్, భటిండా మరియు అమఅత్‌సర్‌తో సహా 17 చోట్ల శుక్రవారం మొత్తం దిగ్బంధనాన్ని పాటించినట్లు రైతుల నాయకత్వం తెలిపింది.
పలు రైళ్లు రద్దు...
రైతుల నిరసనల నేపథ్యంలో... పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అనేక ఇతర రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి లేదా రూట్ కట్ చేస్తున్నాయి.










