Aug 20,2023 07:49

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఉప ఎన్నికలు చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. 35 సర్పంచ్‌ స్థానాలకు, 245 వార్డు సభ్యులు స్థానాలకు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్‌ జరిగింది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమైంది. కొన్ని చోట్ల వైసిపి మద్దతుదారులు, టిడిపి మద్దతుదారుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీలో టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ గ్రామంలోకి రానీయకుండా టిడిపి నేత, మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి అనుమతి ఇవ్వడంతో వివాదం నెలకొంది.

  • శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మూడు చోట్ల వైసిపి, ఒకచోట టిడిపి మద్దతుదారులు గెలుపొందారు. పది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఆరింటిలో వైసిపి, నాలుగింటిలో టిడిపి మద్దతుదారులు విజయం సాధించారు.
  • విజయనగరం జిల్లాలో ఐదు పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా మూడుచోట్ల వైసిపి, ఒక స్థానంలో టిడిపి మద్దతుదారులు, మరో స్థానంలో వైసిపి రెబల్‌ అభ్యర్థి గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసిపి మద్దతుదారులు 6, టిడిపి మద్దతుదారులు 2 స్థానాలను కైవశం చేసుకున్నారు.
  • పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఒక్క సర్పంచ్‌ స్థానాన్ని, ఒక వార్డును వైసిపి మద్దతుదారుడు గెలుపొందారు.
  • అనకాపల్లి జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానాన్ని టిడిపి మద్దతుదారు గెల్చుకున్నారు. తొమ్మిది వార్డులకు ఎన్నికలు జరగ్గా వైసిపి మద్దతుదారులు ఎక్కువ వార్డులను గెల్చుకున్నారు.
  • విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక్క వార్డునూ వైసిపి మద్దతుదారుడు విజయం సాధించారు.
  • అల్లూరి జిల్లాలో 14 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసిపి బలపరిచిన వారే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు.
  • పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక్క సర్పంచ్‌ స్థానాన్ని టిడిపి మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. పది వార్డులకుగానూ వైసిపి మద్దతుదారులు 7, టిడిపి మద్దతుదారులు 3 వార్డుల్లో గెలుపొందారు.
  • ఏలూరు జిల్లాలోని మూడు పంచాయతీ సర్పంచ్‌ స్థానాలనూ వైసిపి మద్దతుదారులు గెల్చుకున్నారు. 21 వార్డులకుగానూ వైసిపి మద్దతుదారులు 10 వార్డులు, టిడిపి మద్దతుదారులు పది వార్డులు, జనసేన మద్దతుదారు ఒక వార్డులో గెలుపొందారు.
  • ఎన్‌టిఆర్‌ జిల్లాలో రెండు సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, రెండు స్థానాల్లో వైసిపి బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. మూడు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా, రెండు చోట్ల వైసిపి బలపరిచిన అభ్యర్థులు, ఒక స్థానంలో టిడిపి బలపరచిన అభ్యర్థి గెలుపొందారు.
  • కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్‌, 8 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌గా వైసిపి బలపరచిన అభ్యర్థి గెలుపొందారు. 8 వార్డుల్లో చెరో నాలుగు స్థానాల్లో వైసిపి, టిడిపి బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు.
  • గుంటూరు జిల్లాలో టిడిపి సర్పంచ్‌ అభ్యర్థి విజయం సాధించారు. 3 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగ్గా రెండు టిడిపి, ఒకటి జనసేన బలపరిచిన అభ్యర్థులు గెల్చుకున్నారు.
  • పల్నాడు జిల్లాలో 10వార్టు సభ్యులకు పోటీ నిర్వహించగా టిడిపి 6, వైసిపి 4 గెలుపొందారు.
  • ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానానికి ఎన్నిక జరగ్గా టిడిపి మద్దతుదారుడు విజయం సాధించాడు. 15 వార్డులకు ఎన్నికలు జరగ్గా వైసిపి మద్దతుదారులు ఏడుగురు, టిడిపి మద్దతుదారులు ఎనిమిది మంది గెలుపొందారు.
  • బాపట్ల జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానానికి ఎన్నిక జరగ్గా వైసిపి మద్దతుదారుడు విజయం సాధించారు. 13 వార్డులకుగానూ వైసిపి మద్దతుదారులు ఏడుగురు, టిడిపి మద్దతుదారులు ఎనిమిది మంది విజయం సాధించారు.
  • వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక పంచాయతీ స్థానాన్ని వైసిపి మద్దతుదారుడు గెల్చుకున్నారు.
  • అన్నమయ్య జిల్లా రెండు పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగ్గా వైసిపి మద్దతుదారు ఒక వార్డు, టిడిపి మద్దరుదారు మరో వార్డులో విజయం సాధించారు.
  • తిరుపతి జిల్లాలో ఒక సర్పంచ్‌, ఏడు వార్డులకు ఎన్నికలు జరగ్గా వైసిపి మద్దతుదారులే గెలుపొందారు.
  • అనంతపురం జిల్లాలో ఒక స్థానానికి జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారుడు, 11 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులు ఐదుగురు, వైసిపి మద్దతుదారులు ఆరుగురు విజయం సాధించారు.
  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక స్థానానికి జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారుడు గెలుపొందారు. 13 వార్డులకుగానూ ఏడు వార్డుల్లో టిడిపి మద్దతుదారులు, ఆరు వార్డుల్లో వైసిపి మద్దతుదారులు గెలుపొందారు.
  • నంద్యాల జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానాన్ని వైసిపి గెల్చుకుంది.