- సమయపాలన పాటించని వైద్యులు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు) : మండలం పరిధిలో పెద్దహరివాణం, పెద్దతుంబలం ఆరోగ్య కేంద్రానికి రోగుల తాకిడి పెరిగింది. గ్రామాల్లో కలుషిత నీరు, అపారిశుధ్య వాతావరణంతో దోమకాటు వల్ల ప్రజలు మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, కండ్లకలక ఇతర వ్యాధుల బారిన పడుతూ వైద్యం కోసం వస్తున్నారు. దీంతో రోజువారీ ఒపి 150 నుంచి 200 వరకు నమోదు కావడం విశేషం. మరోవైపు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల విద్యార్థులు కూడా ఏదో ఒక అనారోగ్యంతో సమీపంలోనే గల ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. దీంతో రోగులతో ఆసుపత్రి కిటకిట లాడుతోంది. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 5 నుంచి 10 మంది వరకు వైద్యులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా, ఇప్పటి వరకూ నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు స్థానికంగా ఉండేందుకు సరైన సౌకర్యాల్లేక రావడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులకు వైద్య సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి. ఉన్నత వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు మాత్రమే ఓపీని చూస్తూ వైద్యులు వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వేళలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులు చూసేవారు లేకుండాపోయారు. దీంతో వైద్యం లభించక ప్రథమ చికిత్స చేసి ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు.
సమయపాలన పాటించని వైద్యులు
గ్రామీణ ప్రాంత పేదలకు కార్పొ రేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంలో వైద్యులు సమయపాలన పాటించక పోవడంతో రోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 104 వాహనం ద్వారా నెలలో రెండు సార్లు ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందించాలి.గ్రామంలో ఉండే రోగులు ఉదయం 8 గంటల నుంచే ఎదురు చూస్తుంటారు. శనివారం మండలం పరిధిలో పెద్దతుంబలం పిహెచ్సిలో ఉదయం 9 గంటలకు రావలసిన వైద్యులు ఉదయం 12 గంటలయినా రాకపోవడంతో క్షేత్ర స్థాయి సిబ్బందే వైద్య సేవలు అందించారు. వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమయపాలన పాటించక పోవడంతో గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై డిప్యూటీ డిఎమ్‌హెచ్‌ఒ వివరణ కోరగా ఆమె స్పందించలేదు.
- పెద్దతుంబలం పీహెచ్సీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు సరైన సమయంలో రాకపోవడంతో గర్భిణులు ఆదోని పట్టణానికి రావాల్సి పరిస్థితి ఏర్పడింది.
- పెద్ద హరివనం పిహెచ్‌ఎస్సి పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు,సిబ్బంది
- సరైన సమయం రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామాలలో ఏఎన్‌ఎంలు కూడా సమయం పాలన పాటించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు శుక్రవారం ఉదయం సెంటర్లో హాజరు వేసుకొని, అదనంగా రెండు రోజులు హాజర్ వేసుకొని మరి విధులకు డుమ్మా కొట్టారు. హెల్త్ సెంటర్కు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు వైద్యురాలు హాజరు వేసుకొని అందుబాటులో లేకపోతే ఎలా అని వార్డులోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆసుపత్రిలో లభించని సేవలు : రాజు,పెద్దతుంబలం
ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సరైన సేవలు లభించడం లేవని, ఆదివారం, సెలవు దినాలు వస్తే వైద్యులు ఉండడం లేదు. మధ్యాహ్నం వరకే ఓపీ చూస్తూ వైద్యులు వెళ్లిపోతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










