Apr 18,2023 08:39
  • ఇంకా 63 శాతం కుటుంబాలకు అందని సొమ్ము
  • రేపు మూలపేట పోర్టుకు సిఎం భూమిపూజ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : మూలపేట (భావనపాడు) పోర్టు నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం, పరిహారం చెల్లింపులు పూర్తి స్థాయిలో చేయకుండానే శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. పిడిఎఫ్‌ (ప్రాజెక్టు డిస్‌ప్లేస్డ్‌ ఫ్యామిలీస్‌) కుటుంబాల్లో 63 శాతం కుటుంబాలకు నేటికీ డబ్బులు ఇవ్వలేదు. జిరాయితీ భూములకు అరకొరగానే చెల్లించింది. పరిహారం డబ్బులు తీసుకునేందుకు 40 మందికిపైగా రైతులు తిరస్కరించారు. ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భూసేకరణ, పర్యావరణ మదింపు తదితర సందర్భాల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం లేదు. నోరెత్తితే కేసులు పెడుతుందనే భయంతో కొందరు ఉన్నారు. డబ్బులు తీసుకోకపోతే తర్వాత ఇస్తారో లేదోనన్న భయంతో మరికొందరు ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారంతో సరిపెట్టుకుంటున్నారు. మూలపేట పోర్టు కోసం ప్రభుత్వం 531.69 ఎకరాలను సేకరించింది. అందులో ప్రభుత్వ భూమి 211.38 ఎకరాలు, జిరాయతీ భూములు 320.31 ఎకరాలు ఉన్నాయి. పోర్టు శంకుస్థాపనకు ఈ నెల 19న జిల్లాకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి జిరాయతీ భూములకు అధికారులు హడావుడిగా చెల్లింపులు మొదలుపెట్టారు. ఎకరాకు రూ.25 లక్షలు చొప్పున ఇప్పటివరకు 280 ఎకరాలకు చెల్లించారు. మిగిలిన 40 ఎకరాలకు సంబంధించిన 43 మంది రైతులు పరిహారం తిరస్కరించారు. తమకు పోర్టు అవసరం లేదంటూ తమ భూమి పత్రాలు నేటికీ ఇవ్వలేదు. పోర్టు నిర్మాణంతో 594 కుటుంబాల వారు నిర్వాసితులవుతారని అధికారులు గుర్తించారు. పిడిఎఫ్‌ కుటుంబానికి ఇంటి స్థలంతో కలిపి రూ.9.91 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుటుంబంలో చేతివృత్తిదారులు ఉంటే వన్‌ టైమ్‌ గ్రాంట్‌ కింద రూ.25 వేలు, పశువులశాలకు రూ.25 వేలు పరిహారంగా ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ఇటువంటి వారికి రూ.10.41 లక్షలు చెల్లించనున్నట్లు హమీ ఇచ్చింది. ఇప్పటివరకు సుమారు 200 కుటుంబాలకు మాత్రమే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. శంకుస్థాపనకు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఈలోగా కొందరికి డబ్బులు అందకపోవచ్చని అధికారులే చెప్తున్నారు. ఇళ్లు, పశువులశాలలు, ఇతర నిర్మాణాలు కలిపి మొత్తం 420 ఉన్నట్లు గుర్తించారు.
 

                                                ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి సిద్ధం కాని భూమి

పోర్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న మూలపేట, విష్ణుచక్రం నిర్వాసిత కుటుంబాలకు కస్పానౌపడలో స్థలాలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. మొత్తం 594 కుటుంబాలకు 55 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకూ 30.98 ఎకరాలకు అవార్డు పాస్‌ చేశారు. ఇంకా 24.02 ఎకరాలకు అవార్డు పాస్‌ చేయాల్సి ఉంది. పరిహారం తక్కువగా ఉండడంతో ఇందులో పది ఎకరాలకు సంబంధించిన రైతులు తమ భూమి ఇచ్చేందుకు అంగీకరించలేదు.
 

                                                               అటకెక్కిన హామీలు

భూ సేకరణ, ఇళ్ల కొలతలు తదితర సందర్భాల్లో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని శాంతపరచడానికి మంచి పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. యూత్‌ ప్యాకేజీకి వయసు నిర్ణయించే సందర్భంలో 18 సంవత్సరాలకు నెల, రెండు నెలలు తక్కువగా ఉన్న తమ పేర్లు పిడిఎఫ్‌లో చేర్చాలని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌లను నిర్వాసితులు కోరారు. దీనిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామంటూ వారు హామీ ఇచ్చినా పిడిఎఫ్‌ జాబితాలో ఇటువంటి వారి పేర్లు లేకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి చెట్టు, మొక్కకు పరిహారం ఇవ్వనున్నటు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు జీడి, కొబ్బరి తోటలకు ఏకమొత్తంగా ఎకరాకు రూ.2.75 లక్షల చొప్పున చెల్లిస్తోంది. దీంతో, రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పరిహారం పెంచాలని నిర్వాసితులు కోరుతున్నారు.