పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు బయటపడడం అంత తేలిగ్గా జరగదు. అయితే ఈ లక్షణాలను ఏడేళ్ల ముందే గుర్తించడంలో స్మార్ట్‌వాచ్‌లు సహాయపడుతున్నా యని తాజా అధ్యయనం చెప్తోంది.
బ్రిటన్‌లో కార్డిఫ్ యూనివర్సిటీ లోని 'ది యూకే డిమెన్షియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్'కు చెందిన పరిశోధకుల బృందం స్మార్ట్ వాచ్‌లు ధరించే 1,03,712 మంది నుంచి డేటా సేకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విశ్లేషించింది. వీరిని 2013, 2016 మధ్య వారం పాటు వారి చలన వేగాన్ని ట్రాక్ చేయడం ద్వారా వారు పార్కిన్సన్స్ డెవలప్ కావడానికి కారణం కాగల అంశాలను అంచనా వేశారు. పార్కిన్సన్ విషయంలో ఇది స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగపడు తుందని భావిస్తున్నారు.
'నేచర్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఏం చెప్పిందంటే.. 'మరిన్ని అధ్యయనాలు జరగాలి. ప్రపంచవ్యాప్తంగా దీనిపై జరిగే ఇతర అధ్యయనాల ఫలితాలతో దీన్ని పోల్చి చూడాలి. ఇది ఎంతవరకు కచ్చితమైందో పరిశీలించాలి!' అని పరిశోధకులు సూచించారు.
పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నవారి మెదడు కొన్నాళ్లకు దెబ్బతింటుంది. లక్షణాలలో కొన్ని ఏంటంటే..
అసంకల్పితంగా వణకడం, కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకోవడం. సాధారణంగా ఈ లక్షణాలు బయటపడి, నిర్ధారణ సమయానికే మెదడు కణాలు దెబ్బతిని, కోలుకోలేని నష్టం జరుగుతుంది.
'బ్రిటన్ జనాభాలో సుమారు 30% మంది ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లను ధరిస్తున్నారు. కాబట్టి వారందరికీ చౌకగా, నమ్మదగిన మార్గంలో పార్కిన్సన్ వ్యాధిని ముందే గుర్తించే అవకాశం ఉంది. కేవలం వారంలో తీసుకున్న డేటా సహాయంతో భవిష్యత్తులో ఏడేళ్ల కాలానికి అంచనా వేయగలమని మేం చూపించాం. ఈ అధ్యయన ఫలితాలతో పార్కిన్సన్ వ్యాధిని ముందే గుర్తించగలిగే స్క్రీనింగ్ టూల్‌ను అభివృద్ధి చేయొచ్చు!' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సింథియా సాండర్ చెప్పారు.
యూకే బయోబ్యాంక్ నుంచి ఈ అధ్యయనానికి డేటాను ఉపయోగించు కున్నారు. ఐదు లక్షల మందికి పైగా ప్రజల ఆరోగ్య డేటా ఈ బయోబ్యాంక్ వద్ద ఉంది.
'ఇది కచ్చితమైనదిగా కనిపించింది. వృద్ధాప్యం, బలహీనత వల్ల కలిగే కదలికల సమస్యల నుంచి పార్కిన్సన్ సమస్యను వేరు చేసి చూసిన అధ్యయనం ఇది. ఈ మోడల్‌ను ఇతర న్యూరో డీజనరేటివ్ డిజార్డర్‌లు, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు, కదలికలకు సంబంధించిన సమస్యలకు కారణమయ్యే ఇతర డిజార్డర్లతో పోల్చి చూశాం. డేటాతో అధ్యయనం వల్ల కలిగిన ప్రయోజనం ఇది. పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న వ్యక్తుల నుంచి గుర్తించిన ఫలితాలు విభిన్నం. అయితే, లక్షణాలు కనిపించడానికి ఏళ్లు ముందే వారికి పార్కిన్సన్ ఉన్నట్లు చెప్పాలా? వద్దా? అనేది వైద్యుల ఇష్టం' అని ఈ అధ్యయనంలో భాగమైన డాక్టర్ కేథరీన్ పీల్ అన్నారు.










