Jun 11,2023 13:38

వైవిధ్యమైన కథాంశమైతే.. కొత్త నటీనటులైనా, చిన్న బడ్జెట్‌ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీనే అయితే.. ప్రచారం కొత్తగా ఉంటే మాత్రం యూత్‌ ఆడియన్స్‌ తప్పనిసరిగా కనెక్ట్‌ అవుతారు. మంచి ఓపెనింగ్స్‌ కట్టబెడతారు అన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు సాక్ష్యమే 'పరేషాన్‌' అనే చిత్రం. ఇటీవల విడుదలై యువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 'మసూద'తో మంచి విజయాన్ని అందుకొని, నటుడిగా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు తిరువీర్‌. ఇక రానా దగ్గుబాటి ఈ చిత్రానికి ప్రచారం చేయడంతో అంచనాలు పెరిగాయి. ఇక కథేంటి? ప్రేక్షకులకు ఏమేరకు చేరువైందీ తెలుసుకుందాం..

టైటిల్‌ : పరేషాన్‌
నటీనటులు : తిరువీర్‌, పావని కరణం, మురళీధర్‌ గౌడ్‌, బన్ని అభిరన్‌,
అంజి వల్గుమాన్‌, సాయిప్రసన్న, అర్జున్‌ కృష్ణ, శృతి రియాన్‌, బుడ్డరఖాన్‌ రవి, రాజు బెడిగెల, పద్మ, వసంత తదితరులు
నిర్మాత : సిద్ధార్థ్‌ రాళ్లపల్లి
సమర్పణ : రానా దగ్గుబాటి
సంగీతం : యశ్వంత్‌ నాగ్‌
ఎడిటర్‌ : హరిశంకర్‌
సినిమాటోగ్రఫీ : వాసు పెండమ్‌
రచన-దర్శకత్వం : రూపక్‌ రొనాల్డ్‌సన్‌

కథలోకి వెళ్తే.. మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి సమర్పణ్‌ (మురళీధర్‌ గౌడ్‌). బొగ్గుబావిలో పనిచేసుకుంటూ సమయం దొరికితే క్రైస్తవ ప్రార్థన సభల్లో అనువాదం చేస్తుంటాడు. అతని కొడుకు ఐజాక్‌ (తిరువీర్‌) ఐటీఐ కూడా పాసవ్వక స్నేహితులతో కలిసి ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలని అనుకుంటాడు. దానికోసం పై అధికారికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. భార్య చేతిపై ఉన్న బంగారు గాజులు అమ్మి, రెండు లక్షలను జమ చేస్తాడు. ఆ డబ్బును మధ్యవర్తికి అప్పజెప్పి రమ్మని ఐజాక్‌ని పంపిస్తే.. అందులో కొంత ఆపదలో ఉన్న తన స్నేహితుడు పాషా (బన్నీ అభిరామ్‌) కు ఇస్తాడు. మిగిలినది ఆగమ్‌ సత్తి (అర్జున్‌ కృష్ణ) కు ఇస్తాడు. తన తండ్రికి తెలియకముందే మధ్యవర్తికి ఇవ్వాలని ఐజాక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. మరోవైపు ఐజాక్‌ ప్రేయసి శిరీష (పావని కరణం) తో శారీరకంగా దగ్గరవుతాడు. ఈ క్రమంలో శిరీష గర్భం దాల్చినట్లు ఐజాక్‌కు చెప్పడంతో ఇద్దరూ పరేషాన్‌ అవుతారు. పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలని అనుకుంటాడు. అందుకు కావాల్సిన డబ్బుతో వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అదే రోజు రాత్రి ఐజాక్‌ జేబులోని డబ్బు, పక్కనే ఉన్న స్నేహితుడు సత్తి కనిపించకుండా పోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? డబ్బుతో పారిపోయిన సత్తి దొరికాడా? శిరీష, ఐజాక్‌ పరిస్థితి ఏమైందనేదే మిగిలిన కథ..!
          ఈ మధ్య కాలంలో తెలంగాణ యాస, కల్చర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పరేషాన్‌ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది. మంచిర్యాలకు చెందిన ఐదుగురు సింగరేణి పోరగాళ్ల కథ ఇది. టైటిల్స్‌ నుంచి ఎండింగ్‌ వరకూ ప్రతిదీ తెలంగాణ యాస, భాషని బేస్‌ చేసుకొని, చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు రూపక్‌ రొనాల్డ్‌సన్‌. అయితే కథలో మాత్రం కొత్తదనం లేదు. కానీ తెలంగాణ నేటివిటీని జోడించి, చాలా వినోదాత్మకంగా చూపించారు.
            ఇక సెకండాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. సత్తి కోసం వెతికే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. తాగుడుకు సంబంధించిన సీన్స్‌ ప్రతిసారీ చూపించడం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక సత్తి వేలు తెగిన సీన్‌, ఐజాక్‌ బ్యాండ్‌ డ్రెస్‌ సీన్‌ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్‌ సీన్స్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌కు వస్తే మాత్రం 'పరేషాన్‌' నచ్చుతుంది.
తిరువీర్‌ మంచి నటుడు. ఐజాక్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఆగమ్‌ సత్తిగా అర్జున్‌ కృష్ణ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఐజాక్‌ స్నేహితులు ఆర్జీవీగా రవి, మైదాన్‌గా, పాషాగా బన్ని అభిరామ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం బాగుంది. రెండు పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీి బాగుంది. ఎడిటర్‌ పనితీరు ఫర్వాలేదు.