ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:పాలస్తీనా, ఇజ్రాయిల్‌ది మత సమస్య కాదని, దాన్ని జాతుల సమస్యగా చూడాలని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అన్నారు. 'పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధ పూర్వపరాలు' అనే అంశంపై ప్రపంచ శాంతి సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడలోని యుటిఎఫ్ హోమ్‌లో మంగళవారం సదస్సు జరిగింది. సమాఖ్య నాయకులు దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో లక్ష్మణరావు ముఖ్యవక్తగా పాల్గని ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా దాని వెనుక అమెరికా సామ్రాజ్యవాదుల కుట్ర ఉంటుందన్నారు. పశ్చిమాసియాలో చమురు బావులపైన కన్నేసిన అమెరికా కంపెనీలు అక్కడ పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య చిచ్చురేపుతోందని విమర్శించారు. పాలస్తీనా సమస్యకు నాడు బ్రిటన్ సామ్రాజ్యవాదం ఆజ్యం పోస్తే, నేడు అమెరికా దాన్ని పెంచి పోషించి ఆరని మంటగా మార్చిందన్నారు. పిఎల్‌ఒ వ్యవస్థాపకులు యాసర్ అరాఫత్ కాలంలో జరిగిన రెండు దేశాల గుర్తింపు ఒప్పందం అమలు కాకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. భావోద్వేగాల నుంచి పాలస్తీనాలో హమాస్ అనే సంస్థ పుట్టుకొచ్చిందన్నారు. ఇజ్రాయిల్‌పై దాడి చేసి అక్కడి ప్రజలకు ప్రాణనష్టం కలిగించడం తప్పిదమని పేర్కొన్నారు. దానిని ఆసరాగా చేసుకొని మొత్తం పాలస్తీనా ప్రజానీకంపై ఇజ్రాయిల్ దమనకాండ సాగించడం సహించరానిదని తెలిపారు. ప్రపంచమంతా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిలిచిందన్నారు. మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ దమనకాండకు వంతపాడడం, ఐక్యరాజ్య సమితిలో తటస్థ వైఖరి అవలంబించడంతో దేశం పరువు మంటగలిసిందని తెలిపారు. భారత ప్రభుత్వం మత రాజకీయాలు పక్కనపెట్టి పాలస్తీనా దేశ గుర్తింపుకు డిమాండ్ చేయాలని, పాలస్తీనా ప్రజానీకానికి సంపూర్ణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ పాలస్తీనాలో చిన్నారులు సైతం యుద్ధం కారణంగా మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెవివి రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్ మాట్లాడుతూ ప్రపంచశాంతి కోసం యువత ముందుకు రావాలని కోరారు. కాకినాడ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు, విశ్రాంత అధ్యాపకులు కట్టా కృష్ణారావు వక్తలను వేదికపై ఆహ్వానించగా, ఆర్‌టిఐ జెఎసి నాయకులు పి.దుర్గారమేష్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ప్రపంచ శాంతి సమాఖ్య ఆర్గనైజర్లు పి.వరప్రసాద్, ఐ.సూర్యనారాయణ, టి.నాగేశ్వరావు, వి.రవికుమార్. పి.రామకఅష్ణ, టి.రాజా తదితరులు పాల్గొన్నారు.










