ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : గత రెండేళ్లుగా వివాదాస్పదమైన ద్రాక్షారామ పి వి అర్ హైస్కూల్ ఆస్తులపై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ... ఈనెల 29 నుండి మాగాపు అమ్మీరాజు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గత రెండేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న పివిఆర్ హైస్కూల్, స్కూల్ గ్రౌండ్ అన్యాక్రాంతం చేసేందుకు యాజమాన్యం చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ ప్రముఖ న్యాయవాది వైసిపి రాష్ట్ర విభాగం నాయకులు మాగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుంది. ద్రాక్షారామ హైస్కూల్ కు దాతలు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన హైస్కూల్ భవనాలు, నాలుగు ఎకరాల ఖాళీ స్థలాన్ని పైడా జమిందార్ సత్య ప్రసాద్ హై స్కూల్ మూసివేసి అవి సొంత ఆస్తులుగా పరిగణించి స్కూల్ గ్రౌండ్‌కు తాళం వేయడంతో వివాదం మొదలైంది. పిల్లలందరూ చదువుకునేందుకు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను దాతలు అందజేయగా యాజమాన్యం సొంత ఆస్తులుగా భావించి వాటిని స్వ ప్రయోజనానికి వాడుకునేందుకు కళ్యాణ మండపాలు నిర్మించుకునేందుకు అమ్ముకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, అమ్మిరాజు ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఐదు నెలలుగా పిచ్చి మొక్కలతో ఉన్న గ్రౌండ్‌ను అమ్మిరాజు శుభ్రం చేయించగా పైడా సత్య ప్రసాద్ కుమారుడు పేరుతో అమ్మి రాజు తో పాటు మరో పదమూడు మందిపై పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదు చేశారు. దీనిపై మంగళవారం అమ్మి రాజు మాట్లాడుతూ ... స్కూలు యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి తప్పుడు కేసులు బనాయించినందుకు నిరసనగా ఈనెల 29 నుండి నిరవధిక నిరాహార దీక్షలు ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బోసుబమ్మ సెంటర్ వద్ద కూర్చుంటానని దానికి అందరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.










