Oct 03,2023 11:34

జైపూర్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకే ప్రధాని సహా బిజెపి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, రాజస్ధాన్‌ అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ అన్నారు. ప్రధాని పర్యటన రాజకీయపరమైనదేనని, పాలనాపరంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిది కోట్ల రాజస్ధాన్‌ ప్రజల ఆకాంక్షలు కాషాయ నేతలకు పట్టవని, వారు కేవలం ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

                                                                         చిత్తోర్‌ఘఢ్‌లో మోడీ ప్రచారం

రాజస్ధాన్‌లోని చిత్తోర్‌ఘఢ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో దళితులు, మహిళలపై వేధింపులు పెరగడంతో ప్రజలు బిజెపికి పట్టం కట్టాలని భావిస్తున్నారని మోడీ అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.