ప్రపంచ జీవకోటి మనుగడ నెమ్మది నెమ్మదిగా ప్రమాదాల్లోకి జారిపోతున్న విషయం ఇటీవల తరచూ వింటున్నాం. అభివృద్ధి అనేది జీవరాశి జీవనానికి ఉపయోగపడాలి. మనుగడకు ప్రమాద హేతువు కాకూడదు. కానీ అదే జరుగుతోంది. మన దేశానికి మాత్రమే పరిమితమైన పక్షి జాతులు కొన్ని అంతరించిపోయాయి, ఇంకొన్ని అంతరిస్తున్నాయని, మరికొన్ని అంతరించే ప్రమాదంలో ఉన్నాయని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.

మనదేశంలో పదమూడు వందల యాభై మూడు పక్షి జాతులున్నాయి. అంటే ప్రపంచ పక్షి జాతుల్లో ఇవి 12.04 శాతం అన్నమాట. వీటిలో డెబ్భై ఎనిమిది జాతులు (ఐదు శాతం) మన దేశానికి మాత్రమే చెందినవి. ఈ డెబ్భై ఎనిమిదిలో మూడు జాతులు గత కొన్ని దశాబ్దాలుగా కనుమరుగయ్యాయని ఇటీవల జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త అమితవ మజుందార్ తెలిపారు. అవి మణిపూర్ బుష్ పిట్ట, (పెర్డికులా మణి పురెన్సిస్).. హిమాలయన్ పిట్ట (ఓఫ్రిసియా సూపర్‌సిలియోసా), జెర్డాన్స్ కోర్సర్ (రినోప్టిలస్ బిటోర్క్వాటస్) లు. అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ (ఐయుసిఎన్) 1907లో వీటి మనుగడకు ముప్పు ఉందని తెలిపే రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్ అనే అధ్యయనంలో తెలిపింది.

ఆజాదీ ఏదీ..!
ప్రచురణ రచయితలలో ధృతి బెనర్జీ ఒకరు. ఈమె 'మన దేశంలో డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు జరుపుకున్నాం. అదే సమయంలో జెడ్‌ఎస్‌ఐ '75 ఎండిమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా' పేరుతో ఒక నివేదికను ప్రచురించింది. ఈ విషయాన్ని అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది కూడా. అయినా పరిస్థితి క్షీణ దశలోనే ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం.. నిషేధిత ప్రాంతాలలో మాత్రమే కనిపించే జాతులను సంరక్షించడం తక్షణం చేయవలసిన కర్తవ్యం. ఇదే మా నివేదిక ప్రగాఢ ఉద్దేశ్యం' అని ధృతి పేర్కొన్నారు.

అరుదైనవి.. అంతరిస్తున్నాయి..
'తెల్ల బొడ్డు మినివెట్ పెరిక్రోకోటస్ ఎరిత్రోపైజియస్ పక్షులు పశ్చిమ కనుమలు, నేపాల్, మన దేశంలోని ఆకురాల్చే అడవుల్లో అత్యధికంగా ఉండేవన్నారు. అండమాన్ నికోబార్ దీవులలో ఆసక్తికరమైన నాలుగు పక్షి జాతులు కనిపిస్తున్నాయి. అవి నికోబార్ మెగాపోడ్ (మెగాపోడియస్ నికోబారియన్సిస్), నికోబార్ సర్పెంట్ ఈగిల్ (స్పిలోర్నిస్ క్లోస్సీ), అండమాన్ క్రేక్ (రల్లినా కన్నింగి), అండమాన్ బార్న్ గుడ్లగూబ (టైటో డెరోప్స్టోర్ఫీ). ఇవి తూర్పు హిమాలయాలు, దక్కన్ పీఠభూమి, మధ్య భారత అడవులకు చెందినవి. ఇంకా ఆ దీవుల్లో మరెక్కడా కనిపించని 25 పక్షి జాతులు ఉన్నాయి. అవి నికోబార్ మెగాపోడ్, నికోబార్ సర్పెంట్ ఈగిల్, అండమాన్ క్రేక్, అండమాన్ బార్న్ గుడ్లగూబ వంటి జాతులు. వీటి ఆవిర్భావానికి స్థానిక భౌగోళిక పరిస్థితులే కారణం' అని డాక్టర్ మజుందార్ చెప్పారు.

ఆ ప్రదేశాల్లో మారిన పరిస్థితులకు ఈ పక్షుల మనుగడ ప్రమాదంలో పడింది. పశ్చిమ కనుమల్లో ఇరవై ఎనిమిది ప్రత్యేకమైన జాతులున్నాయి. అవి మలబార్ గ్రే హార్న్‌బిల్, మలబార్ పారాకీట్, అశంబు లాఫింగ్ థ్రష్, వైట్-బెల్లీడ్ షోలకిలి.
'ప్రచురణలో స్థానిక పక్షి జాతుల జీవ-భౌగోళిక ప్రాంతాల వివరాలు, శాస్త్రీయ పేర్లు, ఉపజాతుల తేడాలు, ప్రత్యేక లక్షణాలు, ఇష్టపడే ఆవాసాలు, సంతానోత్పత్తి అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు, చారిత్రక ఔచిత్యం ఉన్నాయి' అని డా. మజుందార్ తెలిపారు. సామాన్యులు, విద్యార్థులలో అవగాహన పెంపొందిద్దాం.. పక్షులను, ప్రాణికోటిని కాపాడుకుందాం.










