Aug 13,2023 14:18

ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌ డెడ్‌ అయింది. అతని కుటుంబసభ్యుల అంగీకారంతో బాధ్యతగా ఎనిమిది మందికి అవయవ దానం చేసి, ప్రాణదాతయ్యాడు. ఇలా విన్నప్పుడు, చదివినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మన వరకూ వచ్చేసరికి అవయవ దానం అనే మాట వినగానే జంకుతాం. మన వల్ల ఇంకొకరు ప్రాణం పోసుకున్నారన్నా, నలుగురి జీవితాల్లో మంచి జరుగుతుందన్నా వినడానికి ఎంతో బాగుంటుంది. బతికుండగానూ కొన్ని అవయవాలలో కొంత భాగాన్ని దానం చేయవచ్చు. 'అదేంటి బతికుండగానే మా అవయవాలు దానం చేస్తే ఎలా బతకగలం? అనారోగ్యానికి గురికామా? ' అనే కదా మీ అనుమానం. అలా ఏమీ జరగదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రాణాలను కాపాడటానికి మన వంతు సహాయం చేయడం మానవత్వం. నేడు (13వ తేదీ) 'అవయవాలు దానం చేయండి.. జీవితాలనివ్వండి..!' అనే థీమ్‌తో 'ప్రపంచ అవయవదాన దినోత్సవం' జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

అవయవ దానం అనేది వైద్యపరంగా చేసే అవయవాల మార్పిడి. చనిపోయే దశలో ఉన్న వ్యక్తికి ఇది పునర్జన్మ. ప్రమాదం వల్ల చనిపోయిన మనిషి శరీరంలో 200 భాగాలు, కణజాలం ఉపయోగపడతాయి. వాటిని దానం చేస్తే, అవసరమైన వాళ్లకు వాటిని వైద్యులు అమర్చుతారు. జన్యుపరమైన, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవ దానం చేస్తే తిరిగి ప్రాణం పోసుకుంటారు. అసలు అలా ఎవరు.. ఎప్పుడు.. ఎలా.. అవయవాలు దానం చేయవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.

ఎవరు ఇవ్వొచ్చు..

స్త్రీ, పురుషులు ఎవరైనా అవయవాలు దానం చేయొచ్చు. అయితే అందుకు కొన్ని పరిమితులున్నాయి. బతికున్నప్పుడు దాత 18 ఏళ్లు పైబడి ఉండాలి. అవయవాలు రక్త సంబంధీకులకు (అమ్మా, నాన్న, సోదరి, పాప, బాబు, భార్య) దానం చేయొచ్చు. ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. బంధుమిత్రులు, ఇతరులు అవయవ దానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. వైద్యపరీక్షల అనంతరమే అవయవాలు సేకరిస్తారు. ఆరోగ్యవంతులైన వారు అవయవ దానానికి అర్హులే. ఏదైనా వైద్యుల పర్యవేక్షణలోనే శస్త్రచికిత్స చేయాలి.

3

గంటల వ్యవధిలోనే..

చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెడ్‌ అని ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే 4 లేదా 5 గంటలు, కాలేయం 8-10 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది. కానీ కుటుంబసభ్యుల అనుమతి ఆలస్యం వల్ల ఇవి పనికిరాకుండా పోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఆప్తులు చనిపోయారనే బాధ ఉంటుంది. అదే సందర్భంలో వారి అవయవాల వల్ల మరికొందరికి జీవితం ఇవ్వొచ్చన్న చైతన్యం అందరికీ కల్పించాలి. వారి అనుమతి మరికొందరికి జీవితాన్నిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది తమ మరణానంతరం వారి అవయవాలు ఉపయోగించుకునేలా ముందుగానే రిజిష్టర్‌ చేసుకుంటున్నారు. మరణానంతరం బంధుమిత్రుల సహకారంతో వీరి అవయవాలను వైద్యులు సేకరిస్తారు.

దానం ఎలా చేయాలి..

  • జీవించి ఉన్నప్పుడు కిడ్నీల్లో ఒకదాన్ని, ఊపిరితిత్తులు, కాలేయం, ప్యాంక్రియాస్‌ లేదా పేగులలో కొంత భాగాన్ని దానం చేయొచ్చు.
  •  గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు, క్లోమం వంటి ముఖ్యమైన అవయవాలను బ్రెయిన్‌ డెడ్‌ సందర్భంలో మాత్రమే చేయొచ్చు.
  •  కార్నియాస్‌, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు మొదలైన ఇతర కణజాలాలను సహజ మరణం అయితేనే వాటి సేకరణను డాక్టర్లు ఆమోదిస్తారు.
  •  పచ్చబొట్టు ఉన్నా, వేయించుకున్నా.. అవయవాలు దానం చేయొచ్చు.
  •  మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాల అలవాట్లు ఉన్న వారు ఆరోగ్య సంరక్షణ నిపుణుల ఆమోదంతోనే కణజాలాన్ని, అవయవాలను దానం చేయాలి.
  •  హెచ్‌ఐవి, ఎయిడ్స్‌, క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అవయవ దానానికి అనర్హులు.
1

ఆమె స్ఫూర్తితో..

యుక్త వయస్సులో ఉన్నవారు, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా, సహజంగా ఇంట్లో మరణించినా కుటుంబసభ్యులు కొంత తెలియక, కొంత అపోహలకు లోనై, మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి, కార్యక్రమాలు (పూడ్చడం/కాల్చడం) ముగిస్తుంటారు. అవయవాలు ఇస్తే కీడు జరుగుతుందని భయపడుతుంటారు. అటువంటి వారికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత వైద్యులది మాత్రమే కాదు మనందరిదీ. 2008లో విశాఖలోని శంకరం అనే ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహలక్ష్మీ తన మరణానంతరం శరీరాన్ని విశాఖ ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి ఇస్తున్నట్లు అనుమతి పత్రాన్ని సమర్పించారు. ఇప్పుడామె దీనిపైనే ఒక ట్రస్ట్‌ నడుపుతున్నారు. దీనిపై అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చైతన్యం అప్పట్లో అవయవ దానంపై అనేక రకాల చర్చలు జరగడానికి దోహద పడింది. ఆమె స్ఫూర్తితో తోటి ఉపాధ్యాయులు 35 మంది ముందుకు వచ్చారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, విద్యాదానం గొప్పదనే చెప్తుంటాం. అయితే, ఏనాటికైనా మారని గొప్ప దానం అవయవ దానం అదే ప్రాణదానం. మనం చనిపోయినా నలుగురికి ప్రాణదానం చేయొచ్చు. మరొకరి శరీరంలో మన అవయవం ఉన్నదంటే నిజంగా మనం తిరిగి సజీవంగా ఉన్నట్లే కదా! ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి.

బతికున్నా చేయొచ్చు..

సమాజంలో మూఢ నమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటి ప్రభావం వల్ల చాలామంది శాస్త్రీయంగా ఆలోచించడం లేదు. శరీరంలో కొన్ని భాగాల్లో కొంతభాగాన్ని దానం చేస్తే అనారోగ్యానికి గురవుతారని, భవిష్యత్తులో ఏ పనీ చేయలేరని, పెళ్లిళ్లు కావని, పిల్లలు పుట్టరని, మునపటిలా జీవించలేమని ఏవేవో అపోహలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన వెంకటరామి రెడ్డికి కాలేయ సమస్య వచ్చింది. కొన్నాళ్లకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసిన ఆయన కూతురు హర్షిత తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశారు. అయినా ఇప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమెకు ఒక పాప. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు.
గతం కన్నా ఇప్పుడు కిడ్నీ, కాలేయానికి సంబంధించిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరిగాయి. ఇలా బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అటువంటివారికి ఒక కిడ్నీ, కాలేయం (లివర్‌) లో కొంతభాగం దానం చేస్తే వారు కోలుకుని, ఆరోగ్యంగా జీవిస్తారు. దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య రెండు శాతం కన్నా తక్కువగా ఉంది. అందుకు కారణాలు.. అవగాహన లోపం, మతపరమైన విశ్వాసాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అపనమ్మకం. దీనిపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చొరవ చూపాలి. ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను విరివిగా, చౌకగా నిర్వహించాలి.

4

దాత మరణిస్తే..

దాత తన మరణం అనంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఒప్పంద పత్రం సమర్పించాలి. అందుకు వారి బంధువు లేదా కుటుంబసభ్యుల అనుమతి అవసరం. మరణించిన దాత అవయవాల శారీరక స్థితి ముఖ్యం. ప్రత్యేక ఆరోగ్య నిపుణులు కేసును బట్టి మార్పిడిపై నిర్ణయం తీసుకుంటారు. కణజాలాలు, కళ్ల విషయంలో వయస్సుతో సంబంధం ఉండదు. ఈ కింది పేర్కొన్నట్లు అవయవ దానం చేయొచ్చు.

  1. మూత్రపిండాలు, కాలేయం : 70 సంవత్సరాలు
  2. గుండె, ఊపిరితిత్తులు : 50 ||
  3. క్లోమం, పేగు : 60-65 ||
  4. కార్నియా, చర్మం : 100 ||
  5. గుండె కవాటాలు : 50 ||
  6. బోన్‌ : 70 . ||

పద్మావతి
94 90 55 94 77