Jul 26,2023 11:08
  • కాటన్‌ బ్యారేజీ వద్ద 9.90 అడుగులు
  • భద్రాచలం వద్ద 37.10 అడుగుల నీటిమట్టం

ప్రజాశక్తి - యంత్రాంగం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. రెండు రోజులు నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ప్రభావంతో మళ్లీ వరదలు వస్తాయోమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 9.40 అడుగులు, భద్రాచలం వద్ద 39.00 అడుగుల నీటి మట్టం నమోదైంది. కాటన్‌ బ్యారేజీ 175 గేట్లను పైకెత్తి 6,96,290 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు. ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి ఉన్న నీటిని దిగువకు వదులుతుండటం, ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని గుండేటి వాగు కాజ్‌వే ముంపులోనే ఉండటంతో 14 గిరిజన గ్రామాలకు వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి వరద క్రమేపీ తగ్గుతోంది.
 

                                                        శబరికి పెరుగుతోన్న వరద

అల్లూరు జిల్లా చింతూరులో శబరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 30 అడుగుల ఉండగా క్రమంగా తగ్గుతూ మంగళవారం ఉదయం 25 అడుగులకు చేరింది. మళ్లీ సాయంత్రానికి 26 అడుగులకు చేరింది. శబరి నదికి ఆనుకొని ఉన్న ప్రజలు ఎర్రంపేట, రత్నాపురం, పోతనపల్లి తదితర గ్రామాల్లో సామాన్లను భద్రపరుచుకొని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫ్లడ్‌ సెంటర్లలో ఉంటున్నారు. చొక్కనపల్లి వరద బాధిత గ్రామంలో సిపిఎం నాయకులు సందర్శించారు. ఏ ఒక్క కుటుంబానికీ ఇప్పటి వరకు నిత్యావసరాలు ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
 

                                                   ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి 9559 క్యూసెక్కుల నీరు వస్తుండగా కాల్వలకు, సముద్రంలోకి కలిపి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3.07 టిఎంసిల నీటిమట్టం నమోదైంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పులిచింతలలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 19.73 టిఎంసిలుగా నమోదైంది. ఎన్‌టిఆర్‌ జిల్లాలోని మునేరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో ఎనిమిదివేల క్యూసెక్యులు కాగా అవుట్‌ ఫ్లో 14వేల క్యూసెక్కులుగా ఉంది. వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం దాములూరు గ్రామాల మధ్య వైరా, కట్టెలేరుకు వరద నీరు చేరటంతో కాజ్‌వేపై రాకపోకలు నిలిపివేశారు.
 

                                                          త్రిపురాంతకం చేరిన సాగర్‌ జలాలు

నాగార్జున సాగర్‌ కుడికాలువ ద్వారా విడుదల చేసి నీరు ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చేరాయి. గొల్లపల్లి, దూపాడు, ముటుకుల, నడిగడ్డ, మంచినీటి చెరువులకు సాగర్‌ నీటిని పంపే పనిలో ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ఉన్నారు. జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, సాగర్‌ జలాలను విడుదల చేయాలని ఇటీవల సిఎంను మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు.