కోదాడ: ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఓటు అనేది మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాస్త్రం అని, ప్రజాస్వామ్యంలో దాన్ని మించిన శక్తి లేదని, కాబట్టి ప్రజలు ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఒకప్పుడు కోదాడలో పంట పొలాలకు నీళ్ల కోసం ప్రతిసారి ధర్నా చేయాల్సి వచ్చేదని, లల్లి పెట్టాల్సి వచ్చేదని సీఎం గుర్తుచేశారు.
సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పాలకులు తెలంగాణలో సాగుబడిని పట్టించుకోకుండా ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయారని ఆరోపించారు. కాళేశ్వరం జలాలను మూసీ దాటించి ఉదయం సముద్రంలో కలిపితే ఇక తెలంగాణకు నీళ్ల కరువు రాదని సీఎం కేసీఆర్ అన్నారు. తాము ప్రజల మేలు కోసం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. కానీ అవతలి పార్టీల వాళ్లకు ఈ సోయి లేదని విమర్శించారు. వాళ్లకు కావాల్సింది ప్రజల ఓట్లే తప్ప మేలు కాదని విమర్శించారు.










