Sep 07,2023 10:40

చెన్నై : ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఐటిసి తయారు చేసిన ఓ బిస్కెట్‌ ప్యాకెట్‌లో ఒక బిస్కెట్‌ తక్కువైనందుకు వినియోగదారుడికి రూ. లక్ష పరిహారం చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టు తీర్పిచ్చింది. తిరువళ్లూర్‌ జిల్లాకు చెందిన దిల్లీబాబు ఐటిసి తయారు చేసిన సన్‌ఫీస్ట్‌ మేరీ లైట్‌ బిస్కెట్‌ ప్యాకెట్‌ కొన్నాడు. ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉంటాయని ర్యాపర్‌పై ముద్రించగా, లోపల 15నే కనిపించాయి. దీంతో, ఆయన వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. కంపెనీ అన్యాయం చేస్తోందని, సేవల్లో లోపం ఉందని, కంపెనీపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని, ఆ ప్యాకెట్‌ అమ్మిన దుకాణం తనకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని కేసు దాఖలు చేశారు. బిస్కెట్‌ ప్యాకెట్‌లను వాటి బరువును బట్టి అమ్ముతామని, బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదని ఐటిసి వివరించింది. కోర్టు ఐటిసి వాదనలను తోసిపుచ్చింది. ప్యాకెట్‌పై 16 బిస్కెట్లు ఉంటాయని ముద్రించినప్పుడు ఆ మేరకు ఉండాల్సిందేనని తీర్పు చెప్పింది. ఆ బిస్కెట్‌ ప్యాకెట్‌కు చెందిన బ్యాచ్‌ అమ్మకాలను మొత్తం నిలిపివేయాలని ఆదేశించింది. బాధితుడికి రూ. లక్ష పరిహారం చెల్లించడంతోపాటుకోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పింది.