ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : సెప్టెంబర్ 8వ తేదీన మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి పిలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు జెడ్పీ హైస్కూలు మైదానంలో చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు పెట్టే భోజనంలో రకరకాలుగా మెనూ మార్పులు చేస్తున్నారని, మెనూ చార్జీలు మాత్రం పెంచడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కార్మికులకు పనికి తగ్గ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. హై స్కూల్స్‌లో 9, 10 తరగతులకు అదనంగా వర్కర్లను కేటాయించాలని, వంట చేసే సమయంలో ప్రమాదాలకు గురైన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం అమలులో స్కూల్స్ మెర్జ్ చేయడంతో అక్కడ ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించి, వంటకు అవసరమైన వంట పాత్రలు ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు జయమ్మ, సుజాత, మారెక్కం అక్కమ్మ, హసీనాబేగం పాల్గొన్నారు.










