ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు రాకుంటే తమ సమస్యలను ఎవరికి చెప్పాలని వైస్ ఎంపీపీ ఎర్ర నాగప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన తుగ్గలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆదెమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ జొన్నగిరి గ్రామంలో విద్యుత్ సమస్య విపరీతంగా ఉందని వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. అదేవిధంగా జొన్నగిరి చెరువులో మట్టిని ఇష్టానుసారంగా తోలడంతో పొలాలకు పోవాలంటే రైతుల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన మైనర్ గేషన్ అధికారులపై మండిపడ్డారు. ఉప్పర్లపల్లి ఎంపీటీసీ నాయక్ మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. రు.18 లక్షలు అవినీతి జరిగింటే దానిపై అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. సక్రమంగా కడుతున్న వారిని వదిలిపెట్టి, లక్షల లక్షల రుణాలు తీసుకున్న వారిపై అధికారులు ఎందుకు రికవరీ చేయడం లేదని ఇదెక్కడ న్యాయమని ఇందిరా క్రాంతి అధికారులపై ధ్వజమెత్తారు. స్పందించిన ఏపిఎం రాధాకృష్ణ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కచ్చితంగా సకాలంలో చెల్లించాలన్నారు. లేనిపక్షంలో వారిపై కేసులు కూడా నమోదు చేయిస్తామన్నారు. మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో 22,400 ఎకరాలలో పంటలు వేయడం జరిగిందని, ఆ పంటలలో రైతులు క్రాఫ్ట్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. క్రాఫ్ట్ బుకింగ్ చేయించని రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సావిత్రి, వైస్ ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, ఎం ఈ ఓ రామ వెంకటేశ్వర్లు గౌడ్, ఏపీఓ రామకృష్ణ, ఎపీఎం రాధాకష్ణ, వివిధ మండల శాఖ అధికారులు పాల్గొన్నారు. మండలంలో 17 మంది అధికార పార్టీ ఎంపీటీసీలు ఉండగా కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారు. అదేవిధంగా 23 మంది సర్పంచులు ఉండగా కేవలం రాతనకు చెందిన సర్పంచ్ మాత్రమే హాజరయ్యారు.










