ఆక్టోపస్ మొలస్కా జాతికి, ఆక్టోపోడా క్రమానికి చెందిన జంతువులు. వీటిని సెఫలోపోడా తరగతిగా విభజించారు. ఇవి సముద్ర జీవులు. సెఫలో పాడ్ అంటే గ్రీకులో తల- పాదం అని అర్థం. అంటే తలకు పాదాలన్నీ కలపబడి ఉంటాయి. ముఖ్యంగా కోరల్రీఫ్‌లు (పగడపు దిబ్బలు) కనిపించే ప్రాంతాల్లో ఉంటాయి. పగడపు దిబ్బలు అంటే హైడ్రాయిడ్‌లు, జెల్లీఫిష్, సముద్రపు ఎనిమోన్‌లకు సంబంధించిన వలస జంతువులుండే ప్రదేశం. ఇవి పీతలు, రొయ్యలు, ఎండ్రకాయలను ఇష్టంగా తింటాయి, సొరచేపల వంటి పెద్ద జీవులపై కూడా దాడి చేయగలవు. ఆక్టోపస్‌లు పై నుండి ఎటాక్ చేస్తాయి. వాటి చేతులను వరుసలో ఉంచి శక్తివంతమైన చూషణలతో జంతువును నోట్లోకి లాక్కుంటాయి.
ఆక్టా అంటే లాటిన్ భాషలో ఎనిమిది అని అర్థం. మొదట సంవత్సరానికి పది నెలలే ఉండేవి. ఎనిమిదవ నెల అక్టోబరు. రోమన్లు జూన్, జులై నెలలను జోడించేటప్పటికి అక్టోబరు పదవ నెలగా మారింది. ఆక్టోపస్‌కు ఎనిమిది చేతుల్లాంటి టెంటకిల్స్ ఉండటం వల్ల దానికా పేరు వచ్చింది. దీనికి రెండు కళ్ళు, ఒక ముక్కుతో కూడిన నోరు అమరి ఉంటాయి. మూడు గుండెలుంటాయి. ఆక్టోపస్‌కి ఒక ప్రధాన మెదడు, రెండు పెద్ద ఆప్టిక్ లోబ్స్, ఎనిమిది చిన్న మెదళ్ళు మొత్తం తొమ్మిది మెదళ్ళు ఉంటాయి. అందుకే ఆక్టోపస్‌లు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. ఆక్టోపస్‌లు వాటిని వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి విభిన్న వ్యూహాలను పన్నగలవు. ఎలాగంటే.. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే చర్మాన్ని రకరకాల రంగుల్లోకి మార్చుకుంటాయి. రకకాల విన్యాసాలు చేస్తాయి. గందరగోళానికి గురిచేసే విధంగా సిరాలాంటి పదార్ధాన్ని చిమ్ముతాయి. లేదా వీలైతే చిన్న పగుళ్లలోకి దూరి పోతాయి., త్వరగా నీటిలోకీ దూసుకుపోతాయి.

- నీలిరక్తం..
ఆక్టోపస్‌లు, గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పీతలు నీలిరంగు రక్తాన్ని కలిగి ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్‌ను సరఫరా చేసే ప్రోటీన్ హిమోసైనిన్‌లో ఇనుముకు బదులుగా రాగి ఉంటుంది. దాంతో రక్తం ఎరుపు రంగులో కాకుండా నీలం రంగులో కనిపిస్తుంది. హిమోసైనిన్ హిమోగ్లోబిన్ కంటే ఉన్నతమైనది. 96 ఆక్సిజన్ అణువులను శోషించుకునే శక్తి దానికి ఉంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ప్రోటీన్‌లు కలిగిన ఆహారంగా పరిగణిస్తారు.
- అద్భుతమైన ఇంద్రియాలు..
ఆక్టోపస్ అకసేరుకమైనప్పటికీ దాని మెదడు, సకశేరుక మెదడులను పోలి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. రూపాలు, ప్రదేశాలను గుర్తుంచుకోవడం, వాటి సంతతిని, అదే జాతికి చెందిన వాటిని, స్పష్టంగా గుర్తిస్తాయట. ఆటలాడుతూనే వస్తువులను అన్వేషిస్తాయట. ఇవేకాక మరికొన్ని సకసేరుకాల లక్షణాలను కలిగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
వాటి చేతుల్లాంటి టెంటకిల్స్ సెన్సార్లుగా, కంట్రోలర్‌లుగా ఉపయోగపడతాయి. అంటే స్పర్శ జ్ఞానమే కాకుండా ఇతర జంతువులు, లేదా శత్రువుల ఉనికిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. టెంటకిల్స్‌కు 10,000 న్యూరాన్‌లు ఉంటాయి. వీటి సహాయంతో స్పర్శ, రుచి, వాసన, గ్రహణ శక్తులు కలుగుతాయి.
ఆక్టోపస్‌ల నిద్ర పోతాయి. ఆ సమయంలో ఎనిమిది టెంటకిల్స్ మెలితిప్పడం, కళ్ళు వేగంగా కదిలించడం, శ్వాసని వేగవంతం చేయడం గమనించారు పరిశోధకులు. నిద్ర సమయంలో ఆక్టోపస్‌లలో నాడీ వ్యవస్థ కార్యకలాపాలు, చర్మ నమూనాను పరిశీలిస్తే, అవి మేల్కొని ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలాంటి చర్యలే జరుగుతున్నాయని తెలిపారు.
వీటి నిద్రకు అంతరాయం కలిగిస్తే మళ్లీ వెంటనే నిద్రలోకి జారుకుంటాయని బందం చెబుతోంది. విలక్షణమైన మెదడు తరంగాలైన స్లీప్ స్పిండిల్స్‌ను చూశారు. సరిగ్గా పనిచేయడానికి అవసరమైన నిద్రను ముఖ్యంగా భావిస్తాయని అధ్యయన రచయిత అదితి పోఫాలే అంటురు. అభ్యాసం, జ్ఞాపకశక్తికి సంబంధించిన లక్షణాలకు ఈ తరంగాలు సంభవిస్తాయని వారు నిర్ణయించారు. సహజంగా మనిషిలో ఈ తరంగాలు కనిపిస్తాయంటారు. అయితే గంటకు ఒకసారి, ఒక నిమిషం పాటు తప్పకుండా నిద్ర కుపక్రమిస్తాయట.

- ప్రయోజనాలు..
ఆక్టోపస్‌లు ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ని అత్యధికంగా కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే కొవ్వు ఆమ్లాలు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ అంటే. ఇవి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఒత్తిడిని, రక్తపోటును తగ్గిస్తాయి. వీటిలో పిండిపదార్థాలు, పీచు పదార్థం, చక్కెర ఉండవు. ఆక్టోపస్‌లో విటమిన్ బి12, బి6, సెలీనియం, ఇనుము, రాగి ఉన్నాయి. వీటిలో చాలా తక్కువ మోతాదులో పాదరసం కణాలు ఉన్నాయి. ఆక్టోపస్‌లు మోరే ఈల్స్, డాల్ఫిన్‌లు, ఆల్బాట్రాస్‌లు, స్పెర్మ్ వేల్స్, సీల్స్ కూడా వీటిని ఇష్టంగా ముఖ్యమైన ఆహారంగా తింటాయి.










