- వారబందీ జరిపయినా వరి పంటను కాపాడాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- కారంచేడు (బాపట్ల జిల్లా):రాష్ట ప్రభుత్వం అత్యవసరంగా కొమ్మమూరు కాలువకు సాగు నీటిని విడుదల చేయాలని, వారబందీ జరిపయినా వరి పంటను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామం పరిధిలో సాగునీరు అందక ఎండిపోయి బీటలు వారిన పొలాలను స్వర్ణ గ్రామ రైతులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. నీరు రాక పంటలు చేతికందకపోతే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టిసీమ, పులిచింతల ద్వారా కొమ్మమూరు కాలువకు ప్రభుత్వం సాగు నీరందించలేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. కొమ్మమూరు కాలువ ఆయకట్టు కింద ఉన్న వేలాదిమంది రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, కృష్ణా నది పక్కనే ఉన్న అవనిగడ్డ, కంకిపాడు ప్రాంత పొలాలకు నీరు అందక అన్నదాతలు ఆందోళనతో ఉన్నారని అన్నారు. సాగునీటి సమస్య పరిష్కరించకపోతే ప్రభుత్వంపై రైతుల యుద్ధం తప్పదని హెచ్చరించారు. పట్టిసీమ పంపులను అన్నింటినీ పూర్తి స్థాయిలో పనిచేయించాలని, పులిచింతల నుండి కూడా యుద్ధప్రాతిపదిక నీరు తీసుకురావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం అత్యవసరంగా తీసుకోవాలని కోరారు. కాలువ చివరి భూముల వరకూ సాగునీరందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు.










