- హిందూపురం, శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన యుటిఎఫ్ స్వర్ణోత్సవ ప్రచార యాత్రలు
ప్రజాశక్తి-హిందూపురం,ఇచ్ఛాపురం :ప్రభుత్వ విద్య పరిరక్షణతో పాటు ఒపిఎస్‌ను సాధించుకోవడమే లక్ష్యంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆ సంఘం నాయకులు తెలిపారు. జిపిఎస్ పేరుతో ఉద్యోగులకు నష్టం చేకూర్చే మరో పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి విజయవాడకు గురువారం బైక్‌ర్యాలీలు చేపట్టారు. ఈ రెండు యాత్రలు అక్టోబర్ ఒకటిన విజయవాడకు చేరుకుంటాయి. యాత్రలను హిందూపురంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఇచ్ఛాపురంలో రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 'ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకుందాం' అన్న నినాదంతో జాతా కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం తీసుకువస్తోన్న నూతన విద్యా విధానంతో ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల అనంతరం జిపిఎస్ పేరుతో ఉద్యోగులకు నష్టం చేకూర్చే మరో పెన్షన్ విధానం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నేటి విద్యారంగ పరిస్థితిపై అక్టోబర్ 1న విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మేధావులతో చర్చ జరుగుతుందని చెప్పారు. 26 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఇచ్ఛాపురంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలు మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శించారు. అంతకుముందు యుటిఎఫ్ పతాకాన్ని పూర్వ రాష్ట్ర కార్యదర్శి బడ్డేపల్లి మోహనరావు ఆవిష్కరించారు.










