Sep 06,2023 14:24

న్యూఢిల్లీ : వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే బిజెపి సర్కార్‌.. తాజాగా దేశం పేరు మార్పుపై కొత్త వివాదానికి తెరలేపింది. సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జి-20 సమ్మిట్‌కి పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, నేతలకు రాష్ట్రపతి భవన్‌ పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్‌ ఆప్‌ ఇండియా పేరును కాస్తా.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌గా పంపిన సంగతి తెలిసిందే. ఇండియా పేరు మార్పుపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని ప్రభుత్వ సమర్థింపు చర్యగానే బిజెపి నేతలు సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆసియన్‌ - ఇండియా సమ్మిట్‌లో పాల్గొనమని మోడీకి పంపిన ఆహ్వాన పత్రికలో కూడా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' అనే పేర్కొనడం మరోసారి చర్చనీయాంశమైంది. ఆసియన్‌ -ఇండియా సమ్మిట్‌ మాత్రమే కాదు.. 18వ ఈస్ట్‌ ఏషియా సదస్సు ఆహ్వాన పత్రికలో కూడా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అనే ఉంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు మోడీ బుధవారం ఇండోనేషియాకు వెళ్లనున్నారు.
కాగా, దేశం పేరు మార్పుపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణల్ని బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. తాజాగా బుధవారం ఆయన ఆసియన్‌ ఇండియా సమ్మిట్‌, 18వ ఈస్ట్‌ ఆసియా సమ్మిట్‌ల ఇన్విటేషన్‌ కార్డులను తన సోషల్‌మీడియా 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. ఈ ఆహ్వాన పత్రికలపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. మోడీ సర్కార్‌ మనల్ని కన్ఫ్యూజ్‌ చేస్తోందని రమేశ్‌ ఆరోపించారు.అయితే దేశం పేరును మార్చేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌పై సెప్టెంబ‌ర్ 18వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఆ ప్ర‌త్యేక సెష‌న్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ఎజెండాను కేంద్ర స‌ర్కార్ వెల్ల‌డిచంలేదు.