Nov 02,2023 08:29
  • డిసెంబరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్షలు : ఎపిపిఎస్‌సి వెల్లడి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, 2 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) వెల్లడించింది. ఈ మేరకు ఎపిపిఎస్‌సి కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 89కు పైగా గ్రూప్‌-1, 900 గ్రూప్‌-2 పోస్టులతోపాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 614 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వివరించారు. వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు డిసెంబరులో నిర్వహించే పరీక్షకు కూడా నిరుద్యోగులు సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. కచ్ఛితమైన నిర్ణీత కాలంలో నియామకాలు పూర్తిచేస్తామని వివరించారు. గ్రూప్‌-2 స్కీం, సిలబస్‌లో హేతుబద్ధమైన మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం 900 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసిందని, జిఓ 77కు అనుగుణంగా ఆయా శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా ఈ నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా, సమర్థవంతంగా, హేతుబద్ధంగా, అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి పూర్తి సమర్థులైన వారిని ఎంపిక చేసేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు. ఐఐటి, హెచ్‌సియు, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, మేధావి వర్గాలు, వివిధ యూనివర్సిటీల్లో నిష్ణాతులైన సీనియర్‌ ప్రొఫెసర్ల, ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిపుణులు, నిరుద్యోగులతో చర్చిస్తామన్నారు. వారి సలహాలతో స్కీం, సిలబస్‌లలో సమూల మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వివరించారు. గతేడాది సెప్టెంబరులో విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు కేవలం 11 నెలల్లో నియామకాలు పూర్తి చేశామని తెలిపారు.