Oct 30,2023 07:49

-వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభలో వక్తలు
-'సమతా స్వాప్నికుడు వేమన' పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి-తిరుపతి :'ప్రవచనాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయితే, నేటి సమాజానికి ప్రజా వచనం చేప్పేవారు కావాలి. కాలాని కంటే ముందు నడిచిన వ్యక్తి. కాలంతోపాటు నడిచిన వ్యక్తి విశ్వకవి వేమన. వేమన పద్యం వేగుచుక్క లెక్కన ఇప్పటికీ అందరినీ ప్రశ్నించేలా చేస్తుంది. అయితే, ప్రశ్నించాలంటే ధైర్యం కావాలి. వేమన విజ్ఞాన కేంద్రం ఆ ధైర్యాన్ని నింపే కేంద్రంగా ఉండాలి' అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి యశోదా నగర్‌లో వేమన విజ్ఞాన కేంద్ర భవనాన్ని ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఆదివారం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు నేత పలవలి రామకృష్ణారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన సభా మందిరాన్ని రామకృష్ణారెడ్డి కుమార్తె, మాజీ వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య కుసుమకుమారి, ప్రముఖ అనువాదకులు ఎజి యతిరాజులు పేరుతో నిర్మించిన సభా మందిరాన్ని ఆయన భార్య ఎజి చంద్రమ్మ ప్రారంభించారు. అంతకుముందు టిటిడి పరిపాలనా భవనం నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులు, విద్యా సాహితీవేత్తలతో 'వేమన పద్యానికి పట్టాభిషేకం' పేరుతో వేమన విజ్ఞాన కేంద్రం వరకూ పద్యాలను పాడుతూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. విజ్ఞాన కేంద్రంలో వేమన పద్యభావన చిత్రలేఖన ప్రదర్శన ఆలోచింపజేసేలా ఉంది. 'ఒక సూర్యబింబం.. ఒక దీపస్తంభం.. ఒక జ్ఞానసంద్రం.. ఒక ధైర్య శిఖరం' అంటూ తిరుపతి బాలభవన్‌ విద్యార్థులు ప్రదర్శించిన వేమన పద్య నృత్యరూపకం ఆహూతులను అలరించింది. సభకు తిరుపతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం అధ్యక్షత వహించారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలకపల్లి రవి మాట్లాడుతూ సమాజంలో హేతుబద్ధ ప్రశ్నను నేర్పించిన కవి వేమన అని కొనియాడారు. దర్శనికంగా, వాస్తవికంగా, పరిశోధనాత్మకంగా తన పద్యాలతో సామాన్యునికి పట్టం కట్టిన విశ్వకవి వేమన అని పేర్కొన్నారు. పిరికితనం, మురికితనం పోవాలని, మానవతా దృష్టి పెరగాలని, ప్రస్తుతం సమాజానికి కావాల్సింది ప్రజావచనమని అన్నారు. ఆధునిక కవిత్రయమంటే వేమన, గురజాడ, శ్రీశ్రీలేనని ఉద్ఘాటించారు. హేతుశీలత, మానవీయత, సామాజిక న్యాయం, ధిక్కారతత్వం, శ్రమ గౌరవం, ప్రతిఘటనల ప్రతిబింబం వేమన పద్యమని వివరించారు. అందుకే ఆయన జనప్రియుడని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ వేమన పద్యాలను సిపి బ్రౌన్‌ పరిశోధించి, పరిశీలించి, అనువదించి వెలుగులోకి తీసుకురాకుంటే, బహుశా వేమన గొప్పతనం తెలిసుండేది కాదన్నారు. కుసుమకుమారి మాట్లాడుతూ భౌతికవాద దృక్పథాన్ని సమాజానికి అందించిన గొప్ప కవి వేమనని, తన తండ్రి పలవలికి ఎంతో ఇష్టమైన కవి అని తెలిపారు. త్వరలో కేంద్రంలో ఏర్పాటు కానున్న గ్రంథాలయానికి తన కుటుంబం తరపున రూ.50 వేలను విరాళంగా ప్రకటించారు. అనువాద రచయిత ఎజి యతిరాజులు కుమారుడు ఎజి అరవింద్‌ మాట్లాడుతూ కులం, మతం, జాతుల పేరుతో విడిపోయి బలహీనపడుతున్న ప్రస్తుత తరుణంలో వేమన రచనలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటులు కాకరాల, రాయలసీమ సాహితీవేత్త భూమన్‌, రీచ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ లింగుట్ల రమేష్‌నాథ్‌, తిరుపతి జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యక్షులు కెవి చౌదరి, రచయిత్రి కొలకలూరి మధుజ్యోతి, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత పల్లెపట్టు నాగరాజు, విజ్ఞాన కేంద్రాల కో-ఆర్డినేటర్‌ పిన్నమనేని మురళీకృష్ణ, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున పాల్గొన్నారు.