Nov 08,2023 09:27
  • పుట్టపర్తి వేదికగా రెండో విడత 'రైతు భరోసా'నిధులు జమ
  • వారు చేప్పే మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచన

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : తెలుగుదేశం పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో రెండో విడత రైతు భరోసా కింద రూ.2,204.77 కోట్లను బటన్‌ నొక్కడం ద్వారా ఆయన రైతుల ఖాతాల్లో మంగళ వారం జమ చేశారు. అంతకుముందు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందని, పెట్టుబడికి సకాలంలో నిధులు అందుతున్నాయని అన్నారు. '14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించానని చెప్పుకుంటున్న పెద్దమనిషికి ఈ ఆలోచన ఎందుకు రాలేదు?' అని ప్రశ్నించారు. 'టిడిపి పాలనలో స్కీముల్లేవు... అన్నీ స్కాములే' అని అన్నారు. స్కిల్‌ స్కామ్‌... ఇసుక స్కామ్‌, మద్యం స్కామ్‌ ఇలా స్కామ్‌లను ఆయన ప్రస్తావించారు. 'దోచుకోవడం, దాచుకోవడమే వారు పనిగా పెట్టుకున్నారు' అని విమర్శించారు. 'రాబోయే ఎన్నికలకు ముందు కూడా టిడిపి ముఠా మరోమారు మీ వద్దకు వస్తుంది. ప్రతి కుటుంబానికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తామంటూ మాయమాటలు చెబుతారు.వాటిని నమ్మి, మోసపోవద్దు.' అని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపో యిందన్న విమర్శలను ప్రస్తావిస్తూ టిడిపి ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత ప్రభుత్వంలో అప్పులు తక్కువే చేశామని వివరించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై స్పందిస్తూ 'గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కరువు రాలేదు. ఈ ఏడాది కొన్ని మండలాల్లో మాత్రమే కరువు ఉంది' అని చెప్పారు,. వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచామన్నారు. టిడిపి హయాంలో ఐదేళ్లు కరువు ఉన్నప్పటికీ రైతులకు పంటల బీమా కింద రూ.3,400 కోట్లే ఇచ్చార న్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కరువు లేనప్పటికీ తమ ప్రభుత్వం రూ.7,802 కోట్లు పంటల బీమా ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. రైతు భరోసా, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అన్నీ కలిపి ఈ నాలుగున్నరేళ్ల లో రైతుల కోసం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. టిడిపి వ్యవసాయానికి రాత్రి, పగలు కలిపి కూడా తొమ్మిది గంటలు విద్యుత్‌ ఇవ్వలేక పోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పగటి పూటే తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమంలో మంత్రులు కాకాని గోవర్థన్‌రెడ్డి, గుమ్మ నూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్‌ శ్రీ, అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు.
 

                                                                  సిపిఎం నేతల ముందస్తు అరెస్టులు

పుట్టపర్తిలో సిఎం పర్యటన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సిపిఎం, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సోమవారం రాత్రి నుంచే నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్టులకు పాల్పడ్డారు. సిఎం పర్యటన అనంతరం వారిని విడుదల చేశారు. అక్రమ అరెస్టులపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.