Sep 05,2023 08:23
  • విద్యుత్‌ సరఫరాపై పిల్లిమొగ్గలు
  • గంటల్లోనే మారిన డిస్కమ్‌ల తీరు
  • అధికధరలతో కొనుగోళ్లకు నిర్ణయం
  • ప్రజలపై పెనుభారం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్‌ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిల్లిమొగ్గలు వేసింది. విద్యుత్‌ కొరత కారణంగా అధికారికంగానే కోతలు విధిస్తున్నట్లు తొలుత ఎపిఇఆర్‌సి నుండి ప్రకటన వెలువడింది. ఇప్పటికే అమలవుతున్న అనధికారిక కోతలతో ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, మరోవైపు ఎన్నికల సంవత్సరం కూడా కావడంతో ఈ ప్రకటన కలకలం రేపింది. కోతల వేటు పడిన పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అధికారపార్టీలోనూ ఈ విషయం చర్చనీయాంశమైంది. సాయాంత్రానికల్లా డిస్కామ్‌లు తమ వైఖరిని మార్చుకున్నాయి. కోతలు లేవంటూ ప్రకటించాయి. రాష్ట్రంలో గత రెండు రోజులుగా విద్యుత్‌ వినియోగం తగ్గడమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపాయి. కోతలను నివారించడానికి భారీ మొత్తం వెచ్చించి ప్రైవేటు రంగం నుండి విద్యుత్‌ కొనుగోళ్లు చేయడానికి డిస్కమ్‌లు సిద్ధమౌతున్నాయి. రానున్నరోజుల్లో ఈ భారం ప్రజలపైనే పడనుంది.

                                                                         తొలుత అలా...

రాష్ట్రంలో పరిశ్రమలకు భారీ ఎత్తున విద్యుత్‌ కోతలను విధించాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన ్‌(ఎపిఇఆర్‌సి) ఆమోదించింది. ఈ మేరకు శనివారం తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం ఉదయం అధికారికంగా తెలియచేశారు. మంగళవారం నుండి కోతలు అమలులోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలకు పగటిపూట మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తారు. ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం ఆరుగంటల వరకు మాత్రమే పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేస్తామన్న డిస్కామ్‌ల ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు ఎపిఇఆర్‌సి తెలిపింది. మొత్తం మీద పరిశ్రమలకు సరఫరాచేస్తున్న విద్యుత్‌లో 30 శాతం కోత విధిస్తున్నట్లు అదే విధంగా వారానికి ఒక రోజు పవర్‌ హాలిడే (24 గంటలు కరెంటు నిలిపివేత) ఇవ్వాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఎపిఇఆర్‌సి తెలిపింది.

                                                                            సాయంత్రానికి ఇలా...

పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు చేయాలన్న నిర్ణయం పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపింది. అన్ని రంగాల్లో కోతలు తప్పవన్న ఆందోళన సాధారణ ప్రజానీకంలో వ్యక్తమైంది. ఎన్నికల ఏడాదిలో ఈ తరహా నిర్ణయం మంచిది కాదన్న అభిప్రాయం అధికారపార్టీలోనూ వ్యక్తమైంది. దీంతో డిస్కమ్‌ల వైఖరి మారింది. రాష్ట్రంలో పవర్‌ హాలిడే అమలు చేయడం లేదని, పరిశ్రమలకు ఎటువంటి కోతలు లేవని డిస్కమ్‌లు ప్రకటించాయి. విద్యుత్‌ డిమాండుకు అనుగుణంగా సరఫరా మెరుగు పడిందని, మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా డిమాండు తగ్గిందని తెలిపాయి.
         ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సోమ వారం నిర్వహించిన సమావేశంలో విద్యుత్‌ కోతలు విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపాయి.

                                                                        అధిక ధరకు కొనుగోళ్ళు

డిస్కమ్‌లు అందచేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 230 మిలియన్‌ యూనిట్ల(ఎంయు) విద్యుత్‌ డిమాండు ఉంది. ప్రస్తుతం 190 మిలియన్‌ యూనిట్లు మాత్రమే లభ్యమవుతోంది. అంటే 40 మిలియన్‌ యూనిట్లకు లోటు ఉంది. రెండు రోజులుగా ఈ లెక్కలు మారాయని అధికారులు అంటున్నారు. అది నిజమేయైనా ఎక్కువ రోజులు అదే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో యూనిట్‌ రూ.9.10 పైసలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయితే పవర్‌ ఎక్చేంజ్‌లోనూ లభ్యత 22 నుండి 40 శాతంలోపే ఉండటంతో రానున్న రోజుల్లో అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి తప్పదు. ఇప్పటికే పీక్‌ అవర్లో అత్యవసరంగా కొన్ని సంస్థల నుండి యూనిట్‌ రూ.15 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఎపిఇఆర్‌సికి పంపిన ప్రతిపాదనల్లో ప్రస్తావించడం గమనార్హం. రానున్న రోజుల్లో అవసరమైతే ఇంకా ఎక్కువ ధర చెల్లించైనా విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి డిస్కమ్‌లు సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో సరఫరాలో లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదని, ఆ పరిస్థితి రాకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ఎంత ఎక్కువకు విద్యుత్‌ కొనుగోలు చేసినా దాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుండి వసూలు చేసుకునేందుకు సరఫరా సంస్థలకు అనుమతి ఉంది ఈ మేరకు రెగ్యులేటరీ కమిషన్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంటే ఆ భారం చివరకు ప్రజలపైనే పడుతుంది.