ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ (విశాఖపట్నం):ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం తలపెట్టిన 'వైజాగ్ నేవీ మారథాన్' ఎనిమిదో ఎడిషన్ ఉత్సాహంగా సాగింది. నాలుగు విభాగాల్లో జరిగిన ఈ మారథాన్‌లో 20 వేల మంది రన్నర్లు పాల్గన్నారు. 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌ను ఉదయం 4:15 గంటలకు తూర్పు నావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ రాజేష్ పంధార్కర్ బీచ్ రోడ్డులోని ఎంజిఎం గ్రౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను 5.15 గంటలకు వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్, పది కిలోమీటర్ల 10 కె రన్‌ను 6 :15 గంటలకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ రవిశంకర్, 5కె రన్‌ను 6 :45 గంటలకు వైస్ అడ్మిరల్ చీఫ్ అఫ్ స్టాఫ్ హెచ్‌క్యు సమీర్ సక్సేనా ప్రారంభించారు. 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ ఐఎన్‌ఎస్ కళింగా వరకు, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ గీతం యూనివర్సిటీ వరకు, 10కె రన్ తెన్నేటి పార్క్ వరకు, 5కె రన్ కాళీ మాతా గుడి వరకు వెళ్లి మరలా ఎంజిఎం గ్రౌండ్‌కు చేరుకున్నాయి. ఈ వైజాగ్ నేవీ మారథాస్‌లో 40 శాతం మంది ఇండియన్ నేవీ సిబ్బంది, కుటుంబీకులు, 60 శాతం మంది ప్రజలు పాల్గన్నారు. ఈ సందర్భంగా తుర్పు నావికాదళాధిపతి రాజేష్ పంధార్కర్ మాట్లాడుతూ రోజువారీ పనుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మారథాన్ విజేతలకు జిల్లా కలెక్టర్ ఎ మల్లికార్జున బహుమతులు అందజేశారు.










