ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక క్రీడామైదానంలో మంగళవారం హాకీ శిక్షకుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారత జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ఆగస్టు 29న ప్రతీయేటా హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 1905 ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ జన్మించారని ఆయన మెరుపువేగంతో హాకీ క్రీడలో గోల్స్ చేయగల మాంత్రికుడిగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సాధించారని అన్నారు. మైదానంలో పాదరసంలా కదిలిపోతూ బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారు అని కొనియాడారు. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కిందన్నారు. ధ్యాన్‌చంద్ నేతఅత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పతకాలు నెగ్గిందని తెలిపారు. ప్రతి క్రీడాకారునికి ధ్యాన్ చంద్ ఆదర్శనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.










