టాలీవుడ్ ప్రేక్షకులు మిస్టరీ థ్రిల్లర్స్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికే ఈ తరహా కథలు అనేకం వచ్చాయి. వాటిలో కొన్ని విజయం సాధించాయి.. కొన్ని పరాజయం పొందాయి. అయితే అలా వచ్చిన వాటిల్లో అధిక భాగం రొటీన్ కథలే ఎక్కువగా ఉంటాయి. కాస్త అటూ ఇటుగా కథను మార్చేస్తుంటారు. వీటికి కాస్త భిన్నంగా తెరకెక్కిన చిత్రమే 'విరూపాక్ష'. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉంది? కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సూపర్ నేచురల్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేసిన సాయి ధరమ్ తేజ్ విజయం అందుకుంటారా? లేదా? అసలు కథేంటి? తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే... రుద్రవనం అనే ఊరిలో జరిగే జాతరకు సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లితో కలిసి వెళతాడు. రుద్రవనం తన తల్లి పుట్టిన ఊరు కావడంతో.. ఆ ఊరితో సూర్యకి బంధం ఉంటుంది. అయితే పుష్కర కాలం క్రితం జరిగిన ఓ సంఘటన కారణంగా తిరిగి ఇప్పుడే ఆ ఊరిలో కాలు పెట్టడం. ఈ క్రమంలో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర ప్రసాద్ (రాజీవ్ కనకాల) కుమార్తె నందిని (సంయుక్తా మీనన్) ని ప్రేమిస్తాడు సూర్య. ఆమె ప్రేమ పొందటం కోసం సూర్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే, మరోవైపు రుద్రవనం గ్రామంలో వరుసగా మనుషులు చనిపోతూ ఉంటారు. దాంతో ఆ ఊరు మొత్తం భయంతో వణికిపోతుంది. ఈ క్రమంలో ఊరి నుంచి సూర్య వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి గుడిలో ఓ వ్యక్తి మరణిస్తాడు. దీంతో ఊరికి అరిష్టం అని అష్టదిగ్బంధనం చేస్తారు. అప్పుడు ఒకరి తర్వాత మరొకరు.. నలుగురు మరణిస్తారు. ఒక దశలో ఆ మరణాలను ఆపడానికి ఏకైక పరిష్కార మార్గం నందిని సజీవ దహనమే అని పూజారి చెబుతారు. అలా ఎందుకు చెప్పారు? ప్రేమించిన అమ్మాయిని, ఊరి ప్రజలను కాపాడటం కోసం సూర్య ఏం చేశాడు? అసలు ఎందుకు మనుషులు చనిపోతున్నారు? వారి చావుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ మిస్టరీని సూర్య ఎలా పరిష్కరించాడు? అనేదే మిగిలిన కథ.

లాజిక్ ఎండ్ అయిన చోట మేజిక్ మొదలవుతుంది. చిత్ర పరిశ్రమ బలంగా నమ్మే సూత్రం ఇది. దర్శకుడు కార్తీక్ దండు సైతం ఓ మేజిక్ నమ్ముకున్నారు.. అదే అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని! ఆ నేపథ్య సంగీతానికి తోడు గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే, శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ! ప్రత్యేక ఆకర్షణ. 'విరూపాక్ష' ప్రచార చిత్రాలు చూస్తే.. ఇది ఏ తరహా చిత్రమో ప్రేక్షకులకు అర్థం కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక 'విరూపాక్ష' ప్రారంభమే ఆసక్తిగా మొదలైంది. ఒళ్ళు జలదరించే సన్నివేశంతో కార్తీక్ కథను ప్రారంభించారు. కథలోకి వెళ్ళింది మొదలు పతాక సన్నివేశాల వరకూ ఉత్కంఠకు గురి చేస్తూ, మధ్య మధ్యలో భయపెడుతూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్‌ని ఫీలయ్యేలా చేశారు.
సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడి మదిలో సందేహాలు కలుగుతూ ఉంటాయి. అసలు మరణాలకు కారణమైన వ్యక్తిని చివరి వరకూ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో సుకుమార్ 100 శాతం విజయం సాధించాడు. అయితే, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్బ్! రెగ్యులర్ హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా కొత్త కథను చూపించడంలో, పల్లెటూరిలో హర్రర్ ఎలిమెంట్స్ సెటప్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఊహించని టర్న్ తీసుకోవడం, మెయిన్ విలన్‌ను ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేయడం బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది? హీరో ఆ చావుల రహస్యాన్ని ఎలా కనిపెడతాడు? ఆ ఊరుని ఎలా కాపాడతాడు? అనే ఉత్కంఠ కలిగించారు. కథగా బాగానే ఉన్నా కథనంలో మరింత పరిపక్వత, గాఢత లోపించాయి. ఈ జాతర్లో లాజిక్కులు ఎవరూ అడగరు. ఎందుకంటే దెయ్యం, క్షుద్రశక్తి అనేవి మేజిక్ తప్ప లాజిక్‌తో సంబంధం లేనివి. నటీనటుల విషయానికి వస్తే.. సాయిధరమ్ తేజ్ పాత్ర చాలా బాగుంది. సూర్య పాత్రలో సాయిధరమ్ తేజ్ కూడా చాలా చక్కగా నటించాడు. కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కీలక సీన్స్‌లో కూడా సాయితేజ్ నటన చాలా బాగుంది. మరో ప్రధానపాత్రలో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని హారర్ సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. మరో కీలకపాత్రలో నటించిన రాజీవ్ కనకాల బాగా నటించారు. అలాగే బ్రహ్మాజీ, అజరు, సునీల్ మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు. అజనీష్ నేపథ్య సంగీతం అద్భుతం. శ్యామ్‌దత్ ఛాయాగ్రహణం కొన్నిచోట్ల భయపెట్టిందనే చెప్పాలి.
టైటిల్ : విరూపాక్ష
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సోనియా సింగ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజరు, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు
స్క్రీన్ ప్లే : సుకుమార్
ఛాయాగ్రహణం : శ్యామ్‌దత్ సైనుద్దీన్
సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ : బాపినీడు. బి
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
కథ, దర్శకత్వం : కార్తీక్ దండు










