Aug 26,2023 11:27

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : పాడిపశువులకు ప్రాణాంతకంగా మారిన లంపీ స్కిన్‌ (ముద్దచర్మం) వ్యాధికి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముందస్తుగానే టీకాలు వేసి పాడిపశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుతోంది.ఇందుకోసం పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే పశువులకు గొంతువాపు, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధి టీకాలు ప్రభుత్వం అందజేస్తోంది. అలాగే గొర్రెలు, మేకలకు పారుడు రోగం, నీలి నాలుక వ్యాధికి టీకాలు అందజేసి సంరక్షిస్తోంది. తాజాగా ప్రాణాంతకమైన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకూ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ జిల్లాలో వ్యాధి లక్షణాలు కనిపించకున్నా, ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం టీకాలు వేసే కార్యక్రమం చేపట్టింది.

                                                     ప్రమాదకరమైన వ్యాధి.. పశువైద్యాధికారి వంశీ

ప్రమాదకరమైన వ్యాధి పశువైద్యాధికారి వంశీ అన్నారు.శనివారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ లంపీ స్కిన్‌ (ముద్దచర్మం) వ్యాధిని తొలిసారిగా 1992లో ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో గుర్తించారు.2019లో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల్లోనూ లంపీ స్కిన్‌ కేసులు నమోదయ్యాయి.
2022లో జిల్లాలో సుమారు వంద పశువుల మఅత్యువాతపడ్డాయి. ముఖ్యంగా ఆవులు, దూడలకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులకు చర్మంపై బుడిపెలు, దద్దుర్లు ఏర్పడతాయి. ఇది వైరస్‌ ద్వారా పాడిపశువులకు వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన పశువుల్లో 10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. 105 డిగ్రీల వరకూ జ్వరం వస్తుంది. చర్మం ముద్దగా మారుతుంది. దీంతో పశువులు మేత, నీరు తీసుకోవడం నిలిపివేస్తాయి. కళ్లు, ముక్కు నుంచి నీల్లు కారుతాయి. ముట్టెమీద, నోటి దూలం లోపల బుడిపెలు వస్తాయి. మెడ, తొడ దగ్గర లింప్‌ గ్రంథులు వాస్తాయి. పశువుల చర్మంపై బుడిపెలు ఏర్పడి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువులు మేత మేయక పాలు పూర్తిగా తగ్గిపోతాయి. చర్మంతోపాటు పొదుగు, బాహ్య జననేంద్రియాలపై దద్దుర్లు కనిపిస్తాయి. నొప్పి అధికంగా ఉండి పాలు పితకనీయవు. అయితే సకాలంలో వైద్యులను సంప్రదిస్తే ఫలితం ఉంటుంది. వ్యాధి సోకిన పశువుల్లో 1 నుంచి 5 శాతం వరకూ మృత్యువాత పడవచ్చు. ఒక గ్రామంలో అన్ని పశువులకూ వైరస్‌ సోకితే ప్రమాద స్థాయిపెరుగుతుందని అన్నారు. 80 శాతం గ్రామాలలో టీకాలు వేశాం. ఇప్పటికే మండలం పరిధిలో చిన్న పెండేకల్‌, పెద్ద పెండేకల్‌, ఆరెకల్‌, నాగలాపురం, పెద్ద హరివనం, పెద్ద తుంబలం, జాలమంచి, కుప్పగల్‌, తదితర గ్రామాలలో 80 శాతం టీకాలు వేశాం. ఇప్పటికే ఏవైనా గ్రాములు మిగిలిన పశువులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.