అగలి (శ్రీసత్యసాయి) : బైక్‌పై వెళుతున్న తల్లీకుమారుడిని దుండగులు వెంబడించిమరీ వేట కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం పి.బ్యాడిగెర సమీపంలో జరిగింది. మొదట కారులో వచ్చిన దుండగులు కొడికొండ - సిరా జాతీయ రహదారిపై తల్లి మంగళమ్మ, కుమారుడు మారుతి కోసం కాపు కాశారు. ఇది గమనించిన తల్లీకుమారుడు వెంటనే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు కారులో వారిని వెంబడించి వేట కొడవళ్లతో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఉల్లేకెర గ్రామ సమీపం వరకు సుమారు కిలోమీటరు మేర తల్లీకుమారులను వెంబడించి ఆ తరువాత వారిద్దరినీ వదిలేశారు. అక్కడనుంచి తప్పించుకున్న బాధితులు స్థానిక ఎస్సై లావణ్యకు సమాచారమిచ్చారు. పోలీసు సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకొని ఇద్దరినీ సిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










