ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని నర్సిపురం కుమ్మరివీధిలో సోమవారం రాత్రి పూరింటి మట్టిగోడ కూలి మరిశర్ల సత్యవతి (45), ఆమె కుమార్తె మరిశర్ల గంగ (20) నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన రెండు రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. అయిన వాళ్ల మధ్యనే నివాసం ఉంటున్నప్పటికీ మంగళవారం ఊరంతా దసరా సంబరాల్లో మునిగి ఉండడంతో తల్లి కుమార్తె సంచారం గురించి ఎవరూ పట్టించుకోలేదు. బుధవారం ఉదయం స్థానికులు వారి ఇంటి తలుపులు తీసి చూడగా శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయిన తల్లి కూతుళ్ల శవాలను గమనించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి జీవితాలు ఇలా విషాదంగా ముగియడంతో బంధువులు రోదిస్తున్నారు. సత్యవతి భర్త గౌరీ నాయుడు కొన్నేళ్ల క్రితమే మరణించారు. దీంతో కూలి పనులు చేసుకుంటూ కుమార్తె గంగను, వృద్ధురాలైన అత్తను పోషిస్తూ జీవనం కొనసాగించారు. పూరింటిలో జీవనం సాగిస్తున్న ఆమెకు గ్రామ సమీపంలోనే జగనన్న ఇల్లు మంజూరైంది. కాయ కష్టంతో ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నారు. కుమార్తెకు సంబంధం కుదరడంతో కొత్త ఇంటిలో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్న వారి జీవితాలు ఆకస్మికంగా ముగిశాయి. విఆర్‌ఒ ఫిర్యాదుపై తహశీల్దారు శివన్నారాయణ, రూరల్ ఎస్‌ఐ సింహాచలం మృతదేహాలను బయటకు తీయించి పంచనామా జరిపించారు.










