Aug 26,2023 16:31

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్‌ : నోబెల్‌ బహుమతి గ్రహీత మదర్‌ థెరిస్సా సేవలు మరువలేనివని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ అన్నారు. మదర్‌ థెరిస్సా 113వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, శనివారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి టీజీ వెంకటేష్‌ నివాళులర్పించారు. అనంతరం కేజేఆర్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌ స్టీట్యూట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. దేశానికి సేవలు చేసిన వారిని సందర్భాను సారంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత దేశంలో ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలో ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు మదర్‌ థెరిసా ఎంతగానో కృషి చేసిందన్నారు. మదర్‌ థెరిసా జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మదర్‌ థెరిసా చేసినటువంటి సేవలు ప్రజల్లోకి వెళ్లి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవ చేయాలి అన్న భావన నెలకొల్పుతోందని టీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.