ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) :ఆ గిరిజన విద్యార్థిని పుట్టుకతోనే అంథురాలు. తాను వెలుగు చూడలేకున్నా తనలో దాగి ఉన్న ప్రతిభతో చదువుతున్న పాఠశాలకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి వెలుగు నింపుతోంది. అంథురాలనే చింతను పక్కనపెట్టి చదువులోనూ, క్రికెట్‌లోనూ సత్తా చాటుతూ జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు నిలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొండశిఖర గిరిజన గ్రామమైన బాతుగొడవకు చెందిన అంథ విద్యార్థిని కిల్లక సంధ్య జాతీయస్థాయి అంథుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి అంథుల క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి 27వ తేదీ వరకు ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ క్రికెట్ పోటీల్లో ఇండియా తరఫున ఆడనున్నారు. సంధ్య ప్రస్తుతం విశాఖపట్నం మంగమరిపేటలోని చిన్నజీయర్‌స్వామి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువతున్నారు. చదువుతోపాటు క్రికెట్ పట్ల మక్కువ చూపడంతో పాఠశాల యాజమాన్యం క్రికెట్ క్రీడలో శిక్షణ ఇచ్చింది. బౌలింగ్ విభాగంలో సంధ్య ప్రతిభ చూపారు. బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. ఉమన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఒక ఆణిముత్యం జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల సంధ్య తల్లిదండ్రులు కె.పెంటయ్య, కామి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










