- ఇది దశాబ్దాల ప్రణాళిక
- జాతి ఆధిపత్యం కోసం కాషాయ మూకల దాడి
ఇంఫాల్ : ఈశాన్యంలో ఆధిపత్యం కోసం హిందూత్వ జాతీయవాదం సాగించిన యుద్ధమే మణిపూర్‌లో నేటి ఆటవిక పరిస్థితికి కారణమని ఈశాన్య ప్రాంత పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసిన రచయిత అగ్నాన్ పి చటర్జీ తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు, దశాబ్ద కాలంగా హిందూత్వ శక్తులు అమలు చేస్తున్న ప్రణాళిక అని ఆమె పేర్కొన్నారు. అల్ప సంఖ్యాకులైన ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు, దళితులను లక్ష్యంగా చేసుకుని హిందూ జాతీయవాదులు దీనినొక ప్రయోగశాలగా మార్చుకున్నారు. నాజీల కాల్పనికత, క్రూరత్వం హిందూత్వ జాతీయవాదంగా రూపాంతరం చెందాయి. జాతి విద్వేషాలను రెచ్చగొట్టడం, హింస, దోపిడీ, దౌర్జన్యాల ద్వారా సాధించబడేే సమాజమే వీటి లక్ష్యం. ఆరెస్సెస్ మూల సిద్ధాంత కర్త ఎంఎస్ గోల్వాల్కర్ నాజీలపట్ల ప్రగాఢమైన అభిమానాన్ని ప్రకటించాడు .నరేంద్ర మోడీకి స్పూర్తిగా నిలిచిన గోల్వాల్కర్ ఇలా పేర్కొన్నాడు. 'జాతి మరియు దాని సంస్కృతి స్వచ్ఛతను కాపాడడానికి యూదులు వంటి సెమిటిక్ జాతులనుంచి దేశాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది జాతి గర్వం అత్యధిక స్థాయిలో అక్కడ వ్యక్తమైంది. భారత దేశంలో హిందువులు కాని వారు జీవించాలంటే వారు హిందూ రాజ్యానికి అణగిమణగి ఉండాలి. ఎటువంటి హక్కులు, అధికారాలు ఉండవు, పౌర హక్కులు కూడా పొందలేరు అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలి ' అని చెప్పాడు.
2019లో మోడీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత పురాణ గాథల్లో పేర్కొన్న హిందువుల మాతృభూమి అఖండ భారత్ (అవిభాజ్య భారత్) సాధన గురించి మాట్లాడుతోంది. భారత దేశ వ్యాపితంగా హిందూ జాతీయవాద సమాజాన్ని రూపొందించే ప్రయోగాలు ఈశాన్యంలో ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు, దళితులను టార్గెట్ చేసుకుని వారిని విచ్ఛిన్నం చేయడంపై కేంద్రీకరించాయి. 2022 నుంచి హిందూత్వ జాతీయవాదుల జాత్యహంకార ప్రసంగాలు, క్రూరమైన హింసకు అడ్దు అదుపు లేకుండా పోయింది. హిందూ జాతీయవాద నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు, హిందూ అగ్రకులాల మౌనం, వివిధ న్యాయస్థానాలు, సంస్థలు, రాజ్యం సహకారంతో హిందూత్వ మిలీషియా గ్రూపులు ఇష్టానుసారంగా చెలరేగాయి. 2023లో ఈ క్రూరత్వం తారా స్థాయికి చేరుకుంది. మూక దాడులు, బుల్డోజర్లు, క్రూర చట్టం యుఎపిఎ కింద అక్రమ కేసులు బనాయించడం వంటివి. హర్యానా, యుపి, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్, అస్సాం, కాశ్మీర్.. ఇప్పుడు మణిపూర్‌లో చూస్తున్నాం. స్వేచ్ఛను కాపాడేందుకు ఉద్దేశించిన భద్రతా చర్యలు సామాజిక జీవితాన్ని, మతాన్ని, ప్రభుత్వాన్ని సాయుధం చేసేలా ఉన్నాయి. హిందూయేతరుల వ్యాపారాలను దెబ్బతీసేలా దాడులు పెరిగాయి. గిరిజనుల భూములను లాక్కోవబడం, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులను చొరబాటుదారులుగా, బాహ్య శత్రువులుగా చిత్రించడం వారి అస్థిత్వాన్ని, సంస్కృతిని, ఆత్మ నిర్భరతను దెబ్బతీయడం వంటి చర్యలకు పాల్పడింది.
మార్చి 27 హిందూ మెయితీలను ఎస్టీల జాబితాలో చేర్చడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది. అలా చేయడం వల్ల అట్టడుగున ఉన్న కుకీ వంటి తెగలపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీలు. అందులో 83 శాతం మంది హిందువులు. వివిధ ట్రైబల్ గ్రూపుల కలయిక ద్వారా మెయితీ తెగ ఆవిర్భవించింది. మొదట్లో బ్రాహ్మణీయ క్రమంలో చేరడానికి తిరస్కరించింది. హిందూయీకరణ, కుల వివక్షకు దూరంగా ఉండేవారు. క్రైస్తవులు హిందువులను మతమార్పిడి చేస్తున్నారని హిందూత్వవాదులు తప్పుడు ప్రచారం చేశారు. మెయితీలపై దీని ప్రభావం పడింది. 1995 నాటికి మణిపూర్‌లో 650గా ఉన్న హిందూత్వ సంస్థలు 2017 నాటికి 6,000కు చేరాయి. ఇద్దరు కుకీ మహిళలను నగంగా ఊరేగించడం, వారిపై అత్యాచారానికి పాల్పడడం దీనికి పరాకాష్ట. అయితే ఇందుకు సంబంధించిన వీడియో జులై మధ్యలో ఆన్‌లైన్‌లో వైరల్ కావడం, దీనిపై అన్ని వైపుల నుంచి ఖండనలు వచ్చాయి. వెయ్యిమంది దాకా కుకీలు ఉన్న ఆ గ్రామంపై ఈ మూకలు అంతకుముందు దాడి చేసి పలువురిని హత్య చేశాయి. మెయితీ రాజకీయ నాయకులు మే 3న చోటు చేసుకున్న ఆ ఘటన ఒక మచ్చుతునక మాత్రమేనని పేర్కొనడాన్ని బట్టి చూస్తుంటే వెలుగులోకి రాని అత్యాచారాలెన్నో .. ఈ చర్యకు బాధ్యత వహించడానికి బదులు ఇది మయన్మార్ నుంచి వచ్చిన కుకీ-చిన్ తెగ వారు ఒక పథకం ప్రకారం హింస సృష్టించారని వరల్లు మెయితీ కౌన్సిల్ ఆరోపించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మరో అడుగు ముందుకేసి ఇది నార్కో టెర్రరిజం మిలీషియా పనేనని చెప్పారు.
ఈశాన్య భారతంలో కాషాయ దండును తయారుచేసి, హిందూత్వ ఉద్యమంగా దానిని రూపుదిద్దడానికి ఆరెస్సెస్ గీచిన ప్లాన్‌నే హిందూత్వ శక్తులు ఇక్కడ అమలు చేస్తున్నాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత హిందూత్వ సంస్థలు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశాయి. 2015లో మణిపూర్ అసెంబ్లీలో రెండు సీట్లు గెలుచుకున్న బిజెపి 2017లో ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకుంది. నార్త్ ఈస్ డెమొక్రటిక్ అలయెన్స్, నాగాలతో రాజకీయ పొత్తు పెట్టుకుని బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. మెయితీలను హిందూ జాతీయవాదులుగా మార్చేందుకు వైష్ణవాన్ని ప్రోత్సహించింది. 2022లో బిజెపి ప్రభుత్వం చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, మణిపూర్ సంప్రదాయాలకు సంబంధించిన పాఠ్యాంశాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఖరారు చేయరాదంటూ హుకుం జారీ చేసింది. ఇస్లామిక్ ఫోబియోను రెచ్చగొట్టేందుకు మణిపూర్‌లో ఎన్‌ఆర్‌సిని తీసుకొస్తామని చెప్పింది.
(ఫీచర్స్ అండ్ పాలిటిక్స్)










