Jul 22,2023 09:08
  • సిఎం తక్షణమే తప్పుకోవాలి

మణిపూర్‌ మంటలు చల్లారడం లేదు. అమానవీయ ఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కుకీ వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వెలుగుచూసింది. మూక ఘాతుకం నుంచి తన భార్యను కాపాడలేకపోయానంటూ కార్గిల్‌ యుద్దవీరుడు కన్నీరుపెట్టుకున్నాడు.

  • సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌
  • దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

న్యూఢిల్లీ : మణిపూర్‌ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. మణిపూర్‌లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ, మణిపూర్‌ మహిళా బాధితులకు, ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టాలని, ముఖ్యమంత్రి రాజీనామాకై డిమాండ్‌ చేయాలని సిపిఎం తన శాఖలకు పిలుపిచ్చింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన చేసింది.
         మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన ఘటనతో దేశం యావత్తు రగిలిపోయింది. పైగా వారిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు, ఆమెను కాపాడేందుకు వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేశారు. సంఘటన జరిగిన రెండు వారాల్లోపే బాధిత కుటుంబాలు అత్యంత ధైర్యసాహసాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ ఘాతుకానికి పాల్పడిన నేరస్తులకు రక్షణ కల్పించడానికి మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వం ప్రత్యక్షంగా సాయపడుతోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. రెండున్నర మాసాలుగా రాష్ట్రం మండుతోంది. అయినా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం, బిజెపి అగ్ర నాయకత్వం సమర్ధిస్తూ వస్తోంది. నెలల తరబడి మౌనం పాటిస్తూ వచ్చిన ప్రధాని చిట్టచివరకు చేసిన ప్రకటన జరిగిన సంఘటనను, మణిపూర్‌లో సుదీర్ఘంగా చెలరేగుతున్న హింసాకాండను, పైగా ముఖ్యమంత్రి పక్షపాత పాత్రను చాలా చిన్నది చేసేలా ఉందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం జవాబుదారీతనం అనే సూత్రాన్ని తుదికంటా సమాధి చేసిందని ఆ ప్రకటన విమర్శించింది. బిజెపి చేస్తున్న సుపరిపాలన వాదనపై ఇది అత్యంత గ్రాఫిక్‌ వ్యాఖ్యానమని పేర్కొంది.

                                                      3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు : రేఖా శర్మ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌ అల్లర్ల నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అధికారుల నుంచి స్పందన లేదని జాతీయ మహిళ కమిషన్‌ (ఎన్‌డబ్ల్యుసి) ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ తెలిపారు. గత మూడు నెలల్లో మూడు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, స్పందన కరువైందని పేర్కొన్నారు.
        మే 4న ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేఖా శర్మ మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి జూన్‌ 12న జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు వచ్చినా, ఎందుకు పట్టించుకోలేదని విలేకరులు ఆమెను ప్రశ్నించారు. తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, జులై 19న సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ కావడంతో సుమోటోగా స్వీకరించి.. వివరణ ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశానని రేఖాశర్మ చెప్పారు. మణిపూర్‌లో పలువురు మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి తనకు ఫిర్యాదులు అందినట్లు ఆమె అంగీకరించారు. 'మణిపూర్‌లో మహిళలపై హింసకు సంబంధించి ఆ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా లేఖలు వచ్చాయి. మూడు సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి స్పందన లేదు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సుమోటోగా స్వీకరించి.. అధికారులను వివరణ కోరాను'' అని రేఖా శర్మ తెలిపారు. మే 18, మే 29, జూన్‌ 19 తేదీల్లో అధికారులకు రాసిన లేఖలను రేఖాశర్మ మీడియాకు చూపించారు.

                                              శాంతిని నెలకొల్పండి : విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నెలల తరబడి అల్లర్లు చెలరేగుతున్న మణిపూర్‌లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ, కూకి మహిళలను అమానుషంగా హింసించడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆందోళనలో మణిపూర్‌ స్థానికులు కూడా పాల్గొన్నారు. డివైఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి ఎఎ రహీమ్‌ మాట్లాడుతూ మోడీ పాలనలో ఏ మహిళకూ భద్రత లేదని, మణిపూర్‌ ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రధాని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్‌ బిస్వాస్‌, జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ తదితరులు మాట్లాడారు. మణిపూర్‌ దారుణాలను నిరసిస్తూ త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

                                                            వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్‌

మణిపూర్‌లో మరో షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది. ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్‌ థీక్‌ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు తలను వేలాడదీశారు.

                                  దేశాన్ని రక్షించాను.. నా భార్యను కాపాడుకోలేకపోయా.. : కార్గిల్‌ యుద్ధ వీరుడి ఆవేదన

మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన ఎంత ఆవేదన కలిగిస్తోందో.. ఈ బాధిత మహిళల్లో ఒకరు దేశాన్ని రక్షించే సైనికుడి భార్య అన్న విషయం కూడా అంతే ఆవేదన కలిగిస్తోంది.
         కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని దేశాన్ని రక్షించుకోగలిగాను కానీ.. అవమాన భారం నుంచి తన భార్యను రక్షించుకోలేకపోయానని ఆ సైనికుడు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈ నరకయాతన కొనసాగిందని, తన భార్య ప్రాణాలతో భయటపడినా.. తీవ్ర మానసిక క్షోభ, భయాందోళనలను ఇప్పటికీ అనుభవిస్తోందని తెలిపారు. 'కార్గిల్‌ యుద్ధ సమయంలో ముందు వరసలో ఉండి పోరాటం చేశాను. ఇప్పడు యుద్ధభూమి కంటే నా స్వగ్రామాన్ని భయంకరంగా భావిస్తున్నాను' అని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్‌ తరువాత తను భార్యను, గ్రామాన్ని, ఇంటిని, తోటి గ్రామస్తులను రక్షించుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ దంపతులు ఒక సహాయక శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఆ రోజున తుపాకులు తమ తలపై గురిపెట్టి బలవంతంగా దుస్తులు తొలగించారని, గుంపు ముందు నృత్యం చేయించారని బాధిత మహిళ తెలిపింది.

                                        ఆ దారుణానికి ముందు... హత్యలు.. లూఠీలు.. ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు

ఇంఫాల్‌, న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఒక గూండాల మూక ఇద్దరు గిరిజన మహిళల్ని వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ సంఘటన మే 4న జరగ్గా, దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సైకుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ నకలును కొన్ని మీడియా సంస్థలు సంపాదించాయి. దీని ప్రకారం గిరిజన మహిళలను నగంగా ఊరేగించడానికి ముందు ఈ గూండాల మూక గ్రామాన్ని పూర్తిగా లూటీ చేయడంతోపాటు హత్యలు, ఇళ్లను తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది. నగంగా ఊరేగించబడిన మహిళను రక్షించడానికి ఆమె సోదరుడు ప్రయత్నించగా, అతన్ని దారుణంగా హత్య చేశారు.
         ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కాంగ్పోక్పి జిల్లాలోని సైకుల్‌ పోలీస్‌ స్టేషన్‌కు దక్షిణంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోకి సుమారు 900 నుంచి వెయ్యిమందితో ఉన్న సాయుధ గూండాల మూక మే 4న సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రవేశించింది. వీరిలో చేతిలో ఎకె రైఫిల్స్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, ఐఎన్‌ఎస్‌ఎఎస్‌, 303 రైఫిల్స్‌ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. గూండాల మూక ప్రవేశించడంతోనే గ్రామంపై విరుచుకుపడింది. విధ్వంసం సృష్టించింది. అన్ని చరాస్థులను లూటీ చేసి ఒకచోట నేల మీద వేసి తగలబెట్టింది. ఇళ్లలోని నగదు, ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార ధాన్యాలు ఇలా అన్ని వస్తువులను తగులబెట్టారు. ఈ దాడితో భయపడి ఐదుగురు గ్రామస్థులు సమీప అడవిలోకి పారిపోయారు. వారిని పోలీసులు రక్షిస్తే వారి వద్ద నుంచి కూడా ఆ గ్రామస్థుల్ని ఈ మూక ఎత్తుకెళ్లింది.
           ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఇప్పటివరకూ నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ఒకరి ఇంటిపై స్థానిక ప్రజలు ఇటీవల దాడి చేసి, నిప్పు అంటించారు. తౌబల్‌ జిల్లాలోని పేచీ అవాంగ్‌లో ఉన్న నిందితుడి ఇంటిపై ఈ దాడి జరిగినట్లు పోలీసులు చెప్పారు.
 

                                                        నలుగురు నిందితులకు 11 రోజుల పోలీస్‌ కస్టడీ

నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది.