Oct 22,2023 16:36

హైదరాబాద్‌: ఎన్నికల సన్నద్ధతలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాలుగా సమాయత్తమవ్వడం కోసం ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వార్‌ రూమ్‌ల ఇన్‌ఛార్జిలతో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సమావేశం నిర్వహించారు. మేనిఫెస్టో, తొమ్మిదేళ్ల పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌, హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. మూస పద్ధతులతో కాకుండా.. కొత్త తరహాలో ప్రజలకు చేరువ కావాలని చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా కొత్త ఓటర్లకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.సంస్కారమంటే ఏమిటో కాంగ్రెస్‌ నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని కేటీఆర్‌ అన్నారు. జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడికే సంస్కారం నేర్పించాలన్నారు. కిషన్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బిజెపికి 100.. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పారు బిఆర్‌ఎస్‌ గతం కన్నా మెరుగైన ఫలితాలతో ఘన విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వే రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయన్నారు.