థానే (మహారాష్ట్ర) : మహారాష్ట్ర థానేలోని ఇండిస్టీయల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఐదుగురు గాయాలపాలయ్యారు. గ్యాస్ కంటైనర్‌ని నింపే సమయంలో పేలుడు సంభవించిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. సిఎస్2 (కార్బన్ డైసల్ఫైడ్)తో నింపాల్సిన నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ కంపెనీకి వచ్చింది. ట్యాంకర్‌ని తనిఖీ చేసే సమయంలో పేలుడు సంభవించింది అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, ఐసియుకి తరలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. కంపెనీ ఆవరణలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.










