Jul 30,2023 10:03

మైసూరు : దేశంలోకెల్లా మధ్యప్రదేశ్‌లో పులులు అత్యధిక సంఖ్యలో వున్నాయి. 785 పులులతో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో వుండగా, 563 పులులతో కర్ణాటక రెండో స్థానంలో వుందని భారత్‌లో 2022లో పులుల స్థితిగతులపై వెలువరించిన నివేదిక పేర్కొంది. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టిసిఎ) ఈ నివేదికను విడుదల చేసింది. 2006 నుండి దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కించడం ఆరంభించారు. అప్పటి నుండి నెమ్మదిగా సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈనాడు మొత్తంగా దేశంలో 3682 పులులు వున్నాయి. 2018నాటి నివేదిక ప్రకారం, కర్ణాటకలో 524 వుండగా, మధ్య ప్రదేశ్‌లో 526 వున్నాయి. ఈ నాలుగేళ్ళ కాలంలో కర్ణాటకలో 37పులులు పెరగ్గా, మధ్యప్రదేశ్‌లో ఏకంగా 259 పెరిగాయి. సుశిక్షితులైన సిబ్బంది పెరగడం, తనిఖీలు పెరగడం, మరిన్ని ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాల వల్ల సంఖ్య పెరిగిందని అడవుల (వన్యప్రాణుల) అదనపు ముఖ్య సంరక్షణాధికారి కుమార్‌ పుష్కర్‌ తెలిపారు.